
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో మరోమారు ఈడీ అధికారులు రాహుల్‌ను ప్రశ్నిస్తున్నారు. గత వారం మూడు రోజుల పాటు ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి రాహుల్‌ను ప్రశ్నించారు. రాహుల్‌ను అధికారులు దాదాపు 30 గంటలపాటు విచారించారు. ఇక, గత శుక్రవారమే రాహుల్ నాలుగో రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తన తల్లి సోనియా గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని.. విచారణ వాయిదా వేయాలని రాహుల్ ఈడీని కోరారు. దీంతో ఈడీ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేసింది. దీంతో ఆయన నేడు మరోమారు ఈడీ ముందు హాజరయ్యారు.
మరోవైపు రాహుల్ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ నేడు మరోమారు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టంది. రాహుల్‌పై కక్ష సాధింప , అగ్నిపథ్ కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు శాంతియుత నిరసనలు కొనసాగించాలని కాంగ్రెస్ పిలపునిచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యగ్రహా దీక్ష చేపట్టారు. మల్లికార్జున్ ఖర్గే, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించినందుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్‌లో రైలును ఆపి, రైల్వే ట్రాక్‌ను అడ్డుకున్నారు.
మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్ణయించారు. నేడు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ తమ నిరసనల సందర్భంగా ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై అసభ్యంగా ప్రవర్తించడం, వేధింపులకు గురిచేసినట్లు ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.