
Delhi borders remain flooded with traffic: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ అగ్నిపథ్ స్కీమ్ నేపథ్యంలో ఆందోళనకారులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిపథ్ స్కీమ్ ను ప్రకటించినప్పటి నుంచి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
జూన్ 20న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన తరువాత ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. వందలాది కార్లు గంటల సమయం పాటు ఎక్స్‌ప్రెస్‌వే ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ప్రధాన పని వేళల్లో ట్రాఫిక్ అధికంగా కనిపించింది. అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చర్యలు ప్రారంభించారు. ANI నివేదికల ప్రకారం.. అనేక సంస్థలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయడం ప్రారంభించడంతో ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద సర్హౌల్ సరిహద్దు వద్ద భారీ ట్రాఫిక్ కనిపించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భద్రతా తనిఖీల కారణంగా దేశ రాజధానిలోని చిల్లా సరిహద్దు వద్ద నోయిడా-ఢిల్లీ లింక్ రోడ్డు వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. నోయిడా ADCP రణ్‌విజయ్ సింగ్ మాట్లాడుతూ "ఎవరూ నిరసనకారులు ఇక్కడికి వెళ్లకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. మేము ఢిల్లీ పోలీసులతో కలిసి ముందుకు సాగుతున్నాం" అని తెలిపారు. సాయుధ బలగాల కోసం సైనిక రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించిన వెంటనే ఉద్భవించిన హింసాత్మక నిరసనల కారణంగా అనేక నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. హింసాత్మకంగా మారిన అనేక ప్రాంతాల్లో రాష్ట్రాలు తమ భద్రతను కట్టుదిట్టం చేశాయి.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వంటి ప్రతిపక్షాలు ఈరోజు కూడా నిరసనలు చేపట్టాయి. హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ లలో మొదటి నుంచి అగ్నిపథ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం రాష్ట్రంలోని శాంతిభద్రతలను నిర్వహించడానికి నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని పరిమితం చేశారు. భారత సైన్యంలోకి యువకులను నియమించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా గత నాలుగు రోజులుగా పలువురు ఆర్మీ ఆశావహులు, ప్రతిపక్ష పార్టీలు నిరసనలు తెలుపుతున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఏపీ, మధ్యప్రదేశ్, కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు నిరసనల సందర్భంగా పెద్ద హింసను చూశాయి.