తెలుగు రాష్ట్రాల పార్టీ నేతలకు రాహుల్ గాంధీ షాక్

By pratap reddyFirst Published Aug 25, 2018, 6:09 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల పార్టీ నేతలకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి షాక్ ఇచ్చారు. వచ్చే లోకసభ ఎన్నికలను ఎదుర్కునేందుకు ఆయన శనివారంనాడు మూడు కీలకమైన కమిటీలను వేశారు. 

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల పార్టీ నేతలకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి షాక్ ఇచ్చారు. వచ్చే లోకసభ ఎన్నికలను ఎదుర్కునేందుకు ఆయన శనివారంనాడు మూడు కీలకమైన కమిటీలను వేశారు. ఈ కమిటీల్లో తెలుగు రాష్ట్రాల నేతలకు స్థానం కల్పించలేదు. గతంలో సిడబ్ల్యుసీలో కూడా తెలుగు రాష్ట్రాల నేతలకు స్థానం కల్పించలేదు. 

 కోర్‌ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ కమిటీలను కాంగ్రెసు నియమించింది. తనకు అత్యంత విశ్వాసపాత్రులైన సూర్జివాలా రణదీప్‌, కేసీ వేణుగోపాల్‌లకు కోర్‌ కమిటీలో రాహుల్ గాంధీ స్థానం కల్పించారు.

తొమ్మిది మంది సభ్యుల కోర్‌ కమిటీలో సోనియా గాంధీకి నమ్మకస్థులైనఅశోక్‌ గెహ్లట్‌, ఏకే ఆంటోనీ, గులామ్‌ నబీ ఆజాద్‌, మల్లిఖార్జున ఖర్గే, అహ్మద్‌ పటేల్‌, జైరామ్‌ రమేశ్‌, చిదంబరం ఉన్నారు. 19 మందితో మేనిఫెస్టో కమిటీ, 13 మంది సభ్యులతో పబ్లిసిటీ కమిటీలను వేశారు.

జైరామ్‌ రమేశ్‌, చిదంబరం.. కోర్‌ కమిటీ, మేనిఫెస్టో కమిటీల్లోనూ ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు మేనిఫెస్టో తయారు చేయడానికి, పబ్లిసిటీ ప్రణాళిక రూపొందించే పనిని ఈ కమిటీలు పూర్తి చేస్తాయని అశోక్ గెహ్లాట్ చెప్పారు.

వచ్చే ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగు నాయకులను అధిష్టానం విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. కనీసం మేనిఫెస్టో కమిటీలోనైనా కూడా తెలుగు నేతలకు చోటు కల్పించలేదు.

click me!