దేవాలయంలోకి రాహుల్ గాంధీ ప్రవేశానికి నిరాకరించారు. ముందుస్తుగా అనుమతులు తీసుకున్నప్పటికీ అసోంలోని నగావ్‌లో బతద్రవా మందిరంలోకి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో అసోం సీఎం హిమంత శర్మ రామ రాజ్యం అంటూ కామెంట్ చేశారు.
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్న రాహుల్ గాంధీ అసోంలో ఓ దేవాలయానికి వెళ్లాలని అనుకున్నారు. అనుమతులు తీసుకున్నారు. తీరా మందిరం ముందుకు వెళ్లాక భద్రతా సిబ్బంది ఆయనను లోపలికి అనుమతించలేదు. ఎందుకు అనుమతించరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తాను ఏం తప్పు చేశానని నిలదీశారు. కానీ, అధికారులు మాత్రం ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ వర్కర్లతో ఆలయం ముందే ఆయన ధర్నాకు దిగారు. ఈ ఘటనపై అసోం సీఎం హిమంత శర్మ కౌంటర్ ఇచ్చారు. రామ రాజ్య అంటూ ట్వీట్ చేశారు.
నగావ్ జిల్లాలోని బతద్రవా థాన్ ఆలయానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కర్లతోపాటుగా వెళ్లారు. సంఘ సంస్కర్త శ్రీమంత సంకర్ దేవా జన్మించిన ఈ ప్రాంతానికి వచ్చారు. కానీ, ఆయనను ఆలయంలోకి అనుమతించలేదు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే మినహా ఆ ఆలయం నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఏ కాంగ్రెస్ నేతనూ అనుమతించలేదని తెలిసింది.
undefined
Also Read : Lord Rama: అయోధ్యతోపాటు మెక్సికోలోనూ ఇవాళే ప్రాణ ప్రతిష్ట.. అమెరికా పురోహితుడి వీడియో వైరల్
ఈ ఘటనపై జైరాం రమేశ్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లాలని అనుకున్నారు. ఇందుకోసం అనుమతుల కోసం జనవరి 11వ తేదీ నుంచి ప్రయత్నాలు చేశాం. మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాం. జనవరి 22వ తేదీన ఉదయం 7 గంటలకు వస్తామని చెప్పాం. వాళ్లు అందుకు అంగీకరించారు. మమ్మల్ని స్వాగతిస్తామని కూడా చెప్పారు. కానీ, ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతించబోమని చెబుతున్నారు’ అని వివరించారు.
22వ తేదీన రాహుల్ గాంధీ బతద్రవా ఆలయానికి వెళ్లరాదని అసోం సీఎం హిమంత శర్మ కోరారు. 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందని, కాబట్టి, ఆ రోజు శ్రీరాముడికి పోటీగా మధ్యయుగాల వైష్ణవ సాధువును తీసుకురావద్దని పేర్కొన్నారు.