రాహుల్ గాంధీ ముందున్న దారులేమిటీ? 8 ఏళ్లు ఎన్నికలకు దూరమేనా? కోర్టులో పిటిషన్ వేస్తారా?

By Mahesh KFirst Published Mar 24, 2023, 4:55 PM IST
Highlights

రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటు ఎదుర్కొన్న తర్వాత ఆయన ముందున్న దారులేమిటీ? న్యాయనిపుణులు ఏమంటున్నారు? అనే విషయాలను ఓసారి చూద్దాం. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేయకుంటే ఇప్పటి నుంచి ఎనిమిదేళ్లు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సూరత్ కోర్టు 30 రోజులు శిక్షపై సస్పెన్షన్ విధించింది గానీ, కన్విక్షన్ పై సస్పెన్షన్ విధించలేదని కపిల్ సిబల్ అన్నారు. కన్విక్షన్ పై సస్పెన్షన్ ఇస్తే రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగవచ్చని వివరించారు.
 

న్యూఢిల్లీ: 2019 పరువునష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేల్చిన తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. లోక్‌సభ సెక్రెటేరియట్ ఈ రోజు ఆయనపై అనర్హత వేటు పడినట్టు ఓ నోటిఫికేషన్‌ పేర్కొంది. కోర్టులో దోషిగా తేలగానే ఆయనపై అనర్హత అమల్లోకి వస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఆ కన్విక్షన్‌ను తోసిపుచ్చగలిగితే అనర్హత వేటు బారి నుంచి తప్పించుకోవచ్చనీ మరికొందరు వివరిస్తున్నారు.

ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకోవడానికి సూరత్ కోర్టు 30 రోజులు శిక్షను సస్పెండ్ చేసింది. శిక్షను 30 రోజులు రద్దు చేసినప్పటికీ చట్టం ప్రకారం ఆయన అనర్హత వేటును ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు తెలిపారు.

ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం, రెండేళ్లకు తగ్గకుండా శిక్ష పడుతూ ఏ కేసులోనైనా దోషిగా తేలిన ఎంపీ అనర్హత వేటును ఎదుర్కొంటారని స్పష్టం చేస్తున్నది.

సూరత్ కోర్టు తీర్పు ఆధారంగానే లోక్‌సభ సెక్రెటేరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గం సీటు ఖాళీ అని ప్రకటించింది. త్వరలోనే ఈ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎన్నిక నిర్వహించడానికి ఈసీఐ ప్రకటించవచ్చు. అంతేకాదు, త్వరలోనే సెంట్రల్ ఢిల్లీలోని ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి ఆదేశాలు రావొచ్చు.

రాహుల్ గాంధీ అనర్హత వేటును కాంగ్రెస్ పార్టీ కోర్టులో సవాల్ చేయవచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు ప్రక్రియపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు సంధించింది.

చట్టం ప్రకారం ఆయన అనర్హుడేనని బీజేపీ ఎంపీ, అడ్వకేట్ మహేశ్ జెఠ్మలానీ అన్నారు. అయితే, ఆ నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. ఇవాళ్టికి ఆయన ఎంపీగా అనర్హుడే అని పేర్కొన్నారు.

Also Read: రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు.. సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ రోజు నుంచే..!

సూరత్ కోర్టు కేవలం ఆయన శిక్షను సస్పెండ్ చేస్తే అనర్హత వేటును సవాల్ చేయలేరని మాజీ కాంగ్రెస్ లీడర్ కపిల్ సిబల్ అన్నారు. ఆయనకు పడిన రెండేళ్ల జైలు శిక్షతో రాహుల్ గాంధీ ఆటోమేటిక్‌గా ఎంపీగా అనర్హుడైనట్టేనని తెలిపారు. 

కోర్టు కేవలం శిక్షను సస్పెండ్ చేస్తే సరిపోదని, ఆయన కన్విక్షన్‌పై సస్పెన్షన్ లేదా స్టే అవసరం ఉంటుందని సిబల్ వివరించారు. ఆ కన్విక్షన్‌పై స్టే ఉంటేనే రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగవచ్చని పేర్కొన్నారు. 

సూరత్ కోర్టు తీర్పును పై న్యాయస్థానాలు కొట్టేయకుంటే రాహుల్ గాంధీ వచ్చే 8 ఏళ్లపాటు (రెండేళ్ల శిక్ష తర్వాత ఆరేళ్లు దూరంగా ఉండాల్సి ఉంటుంది) ఎన్నికలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

సూరత్ కోర్టు తీర్పును పై కోర్టుల్లో సవాల్ చేయాలని రాహుల్ గాంధీ టీమ్ ప్లాన్ చేస్తున్నది. శిక్షను సస్పెండ్ చేయడం, అనర్హత ఆదేశాలను ఫ్రీజ్ చేసే అప్పీల్‌ను పై న్యాయస్థానం అంగీకరించకుంటే.. అప్పుడు వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు.

click me!