'ప్రజల బాధలు పంచుకోవడానికే వచ్చాను': జమ్మూకాశ్మీర్ లో అడుగుపెట్టిన రాహుల్ యాత్ర.. 

By Rajesh KarampooriFirst Published Jan 20, 2023, 6:56 AM IST
Highlights

భారత్ జోడో యాత్ర గురువారం సాయంత్రం జమ్మూకశ్మీర్‌లో అడుగుపెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇక్కడి ప్రజలతో మమేకమై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను టార్గెట్ చేశారు. కొన్నేళ్ల క్రితం మా కుటుంబం జమ్మూకశ్మీర్‌లో ఉండేదని రాహుల్ గాంధీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విశేష స్పందన వస్తుంది. ఆయన ఎంతో మంది కార్యకర్తలు, నేతలు, ప్రజలను కలుసుకుంటూ సాగుతున్నారు. తమిళనాడులో ప్రారంభమైన ఈ సుధీర్ఘమైన యాత్ర ఇక ముగింపుదశకు చేరుకుంది. గురువారం సాయంత్రం భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్‌లో అడుగుపెట్టింది. ఇక్కడి ప్రజలతో మమేకమై రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను టార్గెట్ చేశారు. కొన్నేళ్ల క్రితం తన కుటుంబం జమ్మూకశ్మీర్‌లో ఉండేదని రాహుల్ గాంధీ అన్నారు. తాను కూడా కాశ్మీరీ ప్రజలను కష్టాలను చూశానని అన్నారు. తన యాత్ర తొమ్మిది నుంచి 10 రోజుల పాటు జమ్మూకాశ్మీర్ లో సాగుతుందనీ, ఇక్కడి ప్రజల బాధలు, బాధలు వింటాననీ, వారి బాధలు పంచుకోవడానికే జమ్మూకాశ్మీర్ వచ్చననీ తెలిపారు.  

 జ్యోతి ప్రజ్వలనతో ఫరూక్ అబ్దుల్లా స్వాగతం 

లఖన్‌పూర్‌లోని మహారాజా గులాబ్ సింగ్ విగ్రహానికి రాహుల్ గాంధీ నివాళులర్పించారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా తన చేతిలో జ్యోతితో యాత్రకు స్వాగతం పలికారు. అదే సమయంలో, శివసేనకు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ యాత్రలో చేరడానికి శుక్రవారం జమ్మూ చేరుకున్నారు. కార్యకర్తల ఉత్సాహాన్ని చూసిన రాహుల్ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చేతిలో టార్చ్ పట్టుకుని లఖన్‌పూర్‌కు చేరుకుని, చలిలో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొన్ని నెలల క్రితం కన్యాకుమారి నుంచి మొదలైన మా ప్రయాణం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌కు చేరుకుంది. ఇంతకు ముందు నడవలేమని అనుకున్నామనీ,  ప్రజల నుంచి తనకు చాలా మద్దతు లభించిందని అన్నారు. తాను భారతదేశాన్ని ఏకం చేయడానికి ఈ యాత్ర చేపట్టినట్టు మరోసారి తెలిపారు. 

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ల పై ఫైర్

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు విద్వేషాన్ని వ్యాప్తి చేశాయని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇంతకుముందు ఈ ద్వేషం పాతుకుపోయిందని అనుకున్నాను, కానీ ప్రయాణంలో ప్రజలతో మాట్లాడిన తర్వాత, ఇది టీవీలో మాత్రమే కనిపిస్తుందని నాకు తెలుసు. జీఎస్టీ వల్ల చిరు వ్యాపారులు నష్టపోతున్నారని అన్నారు. ధనికులు మరింత ధనవంతులవుతున్నారు. యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. 12 శాతం మంది ఇంజనీర్లు, వైద్యులు, మిగిలిన వారు నిరుద్యోగులుగా మారారని తెలిపారు. డీమోనిటైజేషన్, జీఎస్టీ రైతులకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. టీవీ ఛానళ్లు, వార్తాపత్రికల్లో ఈ అంశాలు మీకు కనిపించవని రాహుల్ అన్నారు. మోదీ, మీడియా హిందూ ముస్లింల సమస్యలను లేవనెత్తుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. దృష్టి మరల్చడానికే ఇదంతా చేస్తున్నారనీ అన్నారు. టీవీల్లో ఐశ్వర్యరాయ్ లేదా అక్షయ్ కుమార్ ఫోటో చూపిస్తారని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడరని ఎద్దేవా చేశారు.  

click me!