
సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ అమృత్‌సర్ విమానాశ్రయంలో 32 మంది ప్రయాణికులను వదిలిపెట్టి.. టేకాఫ్ అయ్యింది. ఆగ్రహానికి గురైన ప్రయాణికులు అక్కడే నిరసనకు దిగారు. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశించింది. దీంతో స్కూట్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. కలిగించిన అసౌకర్యానికి హృదయ పూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామనీ, తాము ప్రస్తుతం బాధిత వినియోగదారులకు అవసరమైన సహాయం అందించడానికి కృషి చేస్తున్నామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ అయిన స్కూట్ విమానయాన సంస్థ తెలిపింది.
స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం బయలుదేరే సమయంపై ప్రభావం పడింది. బుధవారం (జనవరి 18) రాత్రి 7:55 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా,అమృత్‌సర్ నుండి బయలుదేరే సమయం మధ్యాహ్నం 03.45కి మార్చబడిందని తెలిపారు. దీని గురించి ప్రయాణికులకు వీలైనంత వరకు సమాచారం అందించామని తెలిపారు. విమాన సమయాల్లో మార్పు గురించి ప్రయాణికులందరికీ మెయిల్ చేసినట్లు స్కూట్ ఎయిర్‌లైన్ తెలిపింది. కొంతమంది ప్రయాణీకులు వారి మెయిల్‌ను తనిఖీ చేయకపోవడంతో వారు సమయానికి చేరుకోలేకపోయారు. సమయానికి చేరుకున్న వారిని ఫ్లైట్ తీసుకువెళ్లిందని తెలిపారు.
ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వ్యాఖ్య
అమృత్‌సర్‌లోని శ్రీ గురు రాందాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వికె సేథ్ పిటిఐతో మాట్లాడుతూ.. "బుకింగ్ ఏజెంట్లందరికీ ముందస్తుగానే సమాచారం ఇచ్చామని వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం షెడ్యూల్ మార్చామని, దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్రావెల్ ఏజెంట్లకు చేరవేసినట్టు చెప్పారు. అయితే, ఒక ట్రావెల్ ఏజెంట్ ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యాడని, దీంతో 32 మంది సమయానికి రాలేకపోయారని వివరించారు. విమానం ఎక్కిన 263 మంది ప్రయాణికులు సకాలంలో విమానాశ్రయానికి చేరుకున్నారని ఆయన చెప్పారు.
ఘటనపై డీజీసీఏ నివేదిక కోరింది
ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిర్‌లైన్స్ నుండి నివేదికను కోరింది. నివేదికను కోరామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ సీనియర్ అధికారి తెలిపారు. DGCA మాట్లాడుతూ, "సింగపూర్‌కు వెళ్లే స్కూట్ ఎయిర్‌లైన్స్ (సింగపూర్ ఎయిర్‌లైన్) విమానం షెడ్యూల్‌కు కొన్ని గంటలు ముందే బయలుదేరింది, అమృతసర్ విమానాశ్రయంలో 30 మందికి పైగా ప్రయాణికులు చిక్కుకుపోయిన కేసును DGCA విచారిస్తోంది." అని తెలిపింది.
గత సంఘటన
అంతకుముందు జనవరి 9 న, GoFirst విమానం 55 మంది ప్రయాణికులను తీసుకోకుండా బెంగళూరు నుండి ఢిల్లీకి బయలుదేరింది. ఈ ప్రయాణికులు విమానం ఎక్కేందుకు షటిల్ బస్సులోనే వేచి ఉన్నారు. ఈ ఘటనపై గో ఫస్ట్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ విషయంపై విచారణకు ఆదేశిస్తూ, ఎయిర్‌లైన్ కంపెనీ ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఉద్యోగులందరినీ రోస్టర్ నుండి తొలగించింది. ఈ కేసులో డీజీసీఏ కంపెనీకి షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.