
చెన్నై: పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఓ యువతి కుటుంబసభ్యులు నగదు కాజేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. మోసపోయిన వరుడి కుటుంభీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై తిరువాన్మియూరు కన్నన్ నగర్ 3వ, మెయిన్‌రోడ్డుకు చెందిన కరుణానిధి మాథ్యూ సచివాలయ న్యాయ శాఖ విభాగంలో సూపరింటెండ్‌గా పనిచేసి రిటైరయ్యారు.
మాథ్యూ కొడుకు జార్జ్ డింటేల్. ఇతని వయస్సు 24 ఏళ్లు. జార్జ్ డింటేల్‌కు ఆన్‌లైన్‌లో పళ్లికరనైకు చెందిన రాధిక అనే యువతిని పెళ్లికి ఎంపిక చేశారు. ఆ యువతి నచ్చడంతో ఆమెను వివాహం చేసుకోవాలని జార్జ్ నిర్ణయం తీసుకొన్నాడు.
రాధికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు గిరిధరన్, ఉష, రాజేష్ లు వరుడి ఇంటికి వచ్చారు. వరుడు కూడ నచ్చడంతో పెళ్లికి అంగీకారం తెలిపారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. వివాహనికి ముందుగా నిశ్చితార్థం చేయాలని ప్లాన్ చేశారు.
నిశ్చితార్థం కోసం రూ. లక్ష అవసరమని రాధిక కుటుంబసభ్యులు జార్జ్ డింటేల్ కుటుంబ సభ్యులను కోరారు.తమకు డబ్బులు అందగానే తాము ఈ డబ్బులను తిరిగి ఇస్తామని రాధిక కుటుంబసభ్యులు చెప్పారు.
వరుడి ఇంట్లో పార్క్ చేసిన బైక్‌ను కూడ రాధిక కుటుంబ సభ్యుల్లో ఒకరు తీసుకెళ్లారు. ఈ బైక్‌ను తీసుకెళ్లిన ఆ వ్యక్తి ఎంతకీ రాలేదు. వాళ్ల ఫోన్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. వారు ఇచ్చిన అడ్రస్‌కు వెళ్తే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో ఉన్నవాళ్లు ఖాళీ చేశారని స్థానికులు చెప్పారు.
దీంతో తాము మోసపోయిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.