ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్‌సింగ్ ధామీ ప్రమాణం

By Siva KodatiFirst Published Jul 4, 2021, 8:15 PM IST
Highlights

ఉత్తరాఖండ్‌ 11వ ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామీ (45) ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ప్రమాణం చేయించారు. సీఎంతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు సత్పాల్ మహారాజ్, హారక్ సింగ్ రావత్, బన్సీధర్ భగత్, యశ్‌పాల్ ఆర్య మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు

ఉత్తరాఖండ్‌ 11వ ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామీ (45) ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ప్రమాణం చేయించారు. సీఎంతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు సత్పాల్ మహారాజ్, హారక్ సింగ్ రావత్, బన్సీధర్ భగత్, యశ్‌పాల్ ఆర్య మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. పుష్కర్‌ సింగ్‌ ధామీ 2002-06 వరకూ ఉత్తరాఖండ్ బీజేపీ జనతా యువ మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్‌ కోశ్యారీకి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు.  

కాగా, ఉత్తరాఖండ్‌లో గడిచిన నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలు మారారు. పార్టీలో అసమ్మతి సెగతో ఈ ఏడాది మార్చిలో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మార్చి 10న తీరథ్‌ సింగ్‌ రావత్‌ సీఎంగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన.. సీఎం పీఠంపై కొనసాగాలంటే సెప్టెంబరు 10లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read:ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి

అయితే ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చితోనే ముగియనుండటం, అక్కడ కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా లేదు. మరోవైపు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ అధిష్ఠానానికి తీరథ్‌సింగ్‌ తలనొప్పులు తెచ్చిపెట్టారు. దీంతో ముఖ్యమంత్రిని మార్చేందుకే బీజేపీ మొగ్గుచూపింది. తీరథ్‌ విషయంలో ఎదురైన సమస్యల అనుభవంతో ఈ సారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేను తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఎమ్మెల్యేగా వున్న పుష్కర్‌ సింగ్‌ను సీఎంగా ప్రకటించింది.  

click me!