పంజాబ్‌లో శివసేన లీడర్ సుధీర్ సూరి హత్య.. పట్టపగలే కాల్పులు.. టాప్ పాయింట్స్

By Mahesh KFirst Published Nov 4, 2022, 7:04 PM IST
Highlights

పంజాబ్‌లో శివసేన నేత లీడర్ సుధీర్ సూరిని పట్టపగలే బహిరంగంగా.. అందరూ చూస్తుండగానే హత్య చేశారు. అమృత్‌సర్‌లో ఓ దేవాలయం వెలుపల ఆందోళన చేస్తుండగా తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు.
 

న్యూఢిల్లీ: పంజాబ్‌లో శివసేన నేత సుధీర్ సూరిని దుండగులు పట్టపగలే బహిరంగంగా హత్య చేశారు. తుపాకీతో కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. అమృత్‌సర్‌లో ఓ దేవాలయం ఎదుట ధర్నా చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చుట్టూ జనాలు ఉండగానే సరిగ్గా గురి పెట్టి ఆయననే చంపేశారు. ఆయనకు భద్రతగా వెళ్లిన సిబ్బంది చుట్టే ఉన్నారు. అమృత్‌సర్ పోలీసు కమిషనర్ అరుణ్ పాల్ సింగ్ సుధీర్ సూరి మరణాన్ని ధ్రువీకరించారు.

అమృత్‌సర్‌లో మజీతా రోడ్డు దగ్గర గోపాల్ టెంపుల్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. టెంపుల్‌ వెలుపల చెత్తలో కొన్ని ధ్వంసమైన మూర్తులు కనిపించాయి. దేవతా విగ్రహాలు ఇలా విరిగి పడి ఉండటంతో కొందరు ఆగ్రహానికి లోనయ్యారు. సుధీర్ సూరి ఏకంగా ఆ టెంపులో ఎదుటే ఆందోళనకు దిగారు.

ఈ ఆందోళన జరుగుతుండగానే కొందరు ఆయన పై కాల్పులు జరిపారు. కొందరు మద్దతుదారులు ఆయనను వెంటనే కింద వాలిపోకుండా పట్టుకున్నారు. మరికొందరు గాల్లోకి కాల్పులు జరిపినట్టు స్థానిక విలేకరులు తెలిపారు. మొత్తంగా ఈ ఘటనలో ఐదు తుపాకీ కాల్పులు శబ్దాలు వినిపించినట్టు వివరించారు.

Also Read: శివసేనలో చీలికకు నేను, నా తండ్రి ఉద్ధవ్ ఠాక్రే బాధ్యులం: ఆదిత్యా ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

స్థానిక వర్గాల ప్రకారం, పోలీసులు అటాకర్‌ను గుర్తించారు. వెంటనే అరెస్టు చేశారు. సుధీర్ సూరిపై కాల్పులు జరపడానికి వినియోగించిన తుపాకీని కూడా సీజ్ చేశారు. ఆ నిందితుడు సుధీర్ సూరిపై మూడు సార్లు కాల్పులు జరిపి సమీపంలోని బిల్డింగ్‌లోకి పరుగెత్తినట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శివసేన నేత సుధీర్ సూరి పోలీసులతో మాట్లాడుతుండగానే ఈ దాడి జరిగినట్టు సమాచారం.

సూరి హిట్‌లిస్టులో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయనకు ఇప్పటికే సెక్యూరిటీ కవర్ ఇచ్చారు. ఆయన చుట్టూ జనాలు మూగే ఉన్నారు. అయినా దాడి జరిగింది. అక్కడి జనాలు వెంటనే నిందితుడిని పట్టుకుని పోలీసు కస్టడీకి అప్పగించారు. ఆ నిందితుడిని సందీప్ సింగ్‌గు గుర్తించారు.

సుధీర్ సూరికి వివాదాస్పద నేతగా పేరున్నది. ఆయన ఓ కమ్యూనిటీపై అభ్యంతరకర భాషతో దూషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జులైలో మతపరమైన విద్వేషాన్ని రగిల్చినట్టు ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆయనతో మరికొందరు కలిసి ఒక వర్గం వారిని అభ్యంతరకర పదాలతో దూషిస్తున్న వీడియో ఒకటి ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

click me!