శివసేనలో చీలికకు నేను, నా తండ్రి ఉద్ధవ్ ఠాక్రే బాధ్యులం: ఆదిత్యా ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Nov 4, 2022, 5:55 PM IST
Highlights

శివసేనలో చీలికకు తాను, తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రేలు బాధ్యులు అని ఆదిత్యా ఠాక్రే అన్నారు. ప్రతిపక్షాలపై, సొంత మనుషులపై నిఘా వేయకుండా గుడ్డిగా నమ్మిన తమదే పొరపాటు అని తెలిపారు.
 

ముంబయి: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మనవడు ఆదిత్యా ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీలో చీలిక గురించి ఆయన మాట్లాడుతూ, ఈ చీలికకు తనను, తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రేనే బాధ్యులమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాదీ ప్రభుత్వం కూలిపోయి.. శివసేనలో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో తిరుగుబాటుదారులు బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

శివసేన పార్టీ చీలిపోవడానికి ఏక్‌నాథ్ షిండే బాధ్యులా? బీజేపీ పార్టీ కారణమా? అని అడగ్గా.. ‘అందుకు కారణం మేమే. నా తండ్రి, నేను. వారిని (రెబల్స్)ను గుడ్డిగా నమ్మిన మేమిద్దరమే కారణం. గత 40.. 50 ఏళ్లల్లో ఎవరూ ఇవ్వని పోర్ట్‌ఫోలియో అర్బన్ డెవలప్‌మెంట్ వంటి శాఖలను వారికి ఇచ్చాం. కాబట్టి, వారు ఎప్పుడూ మాతో ఉంటారని విశ్వసించాం’ అని ఆదిత్యా ఠాక్రే అన్నారు.

Also Read: ఎన్నికల కమిషన్‌పై ఉద్ధవ్ ఠాక్రే టీమ్ సంచలన ఆరోపణలు.. ఎన్నికల గుర్తు కేటాయించడంలో పక్షపాతం.. 12 పాయింట్లతో లేఖ

‘వారు మాకు వెన్నుపోటు పొడవరని, గుడ్డిగా నమ్మొచ్చని అనుకున్నాం. ప్రతిపక్షాలనూ ఇబ్బందికి గురి చేయాలని అనుకోలేదు. పోలీసులతో నిఘా పెట్టి.. తరుచూ నోటీసులతో వేధించాలని అనుకోలేదు. మా మనుషులపైనే నిఘా వేయాలని మేం అనుకోలేదు. అలాంటి వాళ్లం కాదు. అది మా తప్పే కదా. రాజకీయాలు మరీ ఇంత దరిద్రంగా ఉంటాయని అనుకోలేదు. కాబట్టి, పార్టీ చీలికకు మేమే బాధ్యులం అనుకోవాలి’ అని తెలిపారు. 

అంటే బీజేపీపై నింద వేయడం లేదా? అని అడగ్గా.. వారిలా బురద రాజకీయాలు చేయలేకపోయం కాబట్టే.. అందుకు బాధ్యులం మేం అని అంటున్నా అని వివరించారు.

Who will get the bow and arrow symbol? Listen in to what said. |

Full coverage: https://t.co/TdmMk9nJH4 pic.twitter.com/neJYtGvetk

— IndiaToday (@IndiaToday)

శివసేన ట్రెడిషనల్ సింబల్ అయిన బాణం, ధనుస్సు మళ్లీ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన పార్టీకి దక్కుతుందా? అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆదిత్యా ఠాక్రేను ఇంటర్వ్యూ చేస్తున్న రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగారు. దానికి తప్పకుండా వచ్చి తీరుతుందని ఠాక్రే సమాధానం ఇచ్చారు. ‘మేం మళ్లీ వీధుల్లోకి వచ్చాం. న్యాయం జరిగినప్పుడు తప్పకుండా ఆ సింబల్ మాకు వస్తుంది’ అని అన్నారు.

click me!