అమిత్ షాతో ముగిసిన అమరీందర్ సింగ్ భేటీ.. బీజేపీలోకి ముహుర్తం ఖరారైనట్లేనా..?

By Siva KodatiFirst Published Sep 29, 2021, 7:21 PM IST
Highlights

పంజాబ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవలే రాజీనామా చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌ను కలిశారు

పంజాబ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవలే రాజీనామా చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌ను కలిశారు. కొద్ది రోజుల కిందట అమరీందర్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ సీఎం కావడం తెలిసిందే. ఇదే అనంతరం ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంగళవారం తన పదవికి రాజీనామా చేయగా ఇప్పుడు అమరీందర్ బీజేపీ అధ్యక్షుడితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిన్న హస్తిన వచ్చిన అమరీందర్ సింగ్.. తన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టంచేశారు. కానీ ఆయన మాత్రం షాతో భేటీ కావడం చర్చకు దారితీసింది. అమిత్ షా అధికార నివాసానికి చేరుకున్న.. కెప్టెన్ వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. బీజేపీలో చేరికపైనే అమరీందర్ డిస్కష్ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి బీజేపీ వైపు నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. అమరీందర్ బీజేపీలో చేరతారా.. లేదంటే మద్దతు తెలుపుతారా అనే విషయంపైనా స్పష్టత రావాల్సి ఉంది.

Also Read:Punjab Crisis : ‘అప్పుడు టీమిండియాను మధ్యలో వదిలేశాడు, ఇప్పుడు...’ సిద్ధూపై అమరీందర్ ఘాటు వ్యాఖ్యలు..

మరోవైపు ఆయనకు కాంగ్రెస్‌లో ఇంకా దారులు మూసుకుపోలేదని అమరీందర్ సింగ్ సన్నిహితులు అంటున్నారు. చర్చలకు అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. కానీ ఈ సమయంలో గాంధీ కుటుంబం.. అమరీందర్‌తో చర్చలు జరుపుతారా అనే అంశంపై క్లారిటీ లేదు. మరోవైపు ఏఐసీసీ పరిశీలకులు హరీశ్ చౌదరీ బుధవారం చండీఘడ్ చేరుకున్నారు. పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సిద్దూ పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన నేపథ్యంలో అక్కడ ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు పెద్దలు శ్రమిస్తున్నారు. 

click me!