Punjab election 2022 : ఇక నుంచి నేను, నా భార్య ఆస్తులు కొన‌బోము- పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్

Published : Feb 07, 2022, 09:01 AM IST
Punjab election 2022 : ఇక నుంచి నేను, నా భార్య ఆస్తులు కొన‌బోము- పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ తరఫున పంజాబ్ సీఎం అభ్యర్థిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎంపికయ్యారు. అనంతరం  ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి నుంచి నేను, నా భార్య ఆస్తులు కొనబోమని హామీ ఇచ్చారు.

Punjab election news 2022 : ఇప్ప‌టి నుంచి నేను, నా భార్య ఆస్తులు కొన‌బోమ‌ని పంజాబ్ సీఎం చ‌రణ్ జిత్ సింగ్ చన్నీ (charanjith singh channi) అన్నారు. అలాగే వ్యాపారం కూడా చేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అక్రమ ఇసుక త‌వ్వ‌కాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆమ్ ఆద్మీ పార్టీ (aap) ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఈరోజు నుంచి నా పేరు మీద‌, నా భార్య పేరు మీద ఎలాంటి ఆస్తిని కొనుగోలు చేయ‌ను. వ్యాపారం కూడా చేయ‌ను. 40 సంవత్సరాలు గడిచాయి, కానీ ఎవరూ నాపై వేలు పెట్టలేదు’’ అని చన్నీ చెప్పారు. 

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు మ‌రి కొన్ని రోజుల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (rahul gandhi) పార్టీ సీఎం అభ్యర్థిగా చన్నీ పేరును ఆదివారం ప్రకటించారు. ఈ ప్రకటన సమయంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (navajyoth singh siddu) కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్నిఆయ‌న అంగీకరించినట్లు చెప్పారు.

గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ త‌రఫున పంజాబ్ సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఉత్కంఠగా మారింది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ సీఎంగా ఉన్నారు. అయితే సీఎం ప‌ద‌వి చేప‌ట్టాల‌ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ ఎన్నో రోజుల నుంచి ఆశిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ హైకమాండ్ మీద సిద్దూ విరుచుకుప‌డుతున్నారు. పైన ఉండే వారి చ‌ప్ప‌ట్ల‌కు తాళాలు వేసే వారినే సీఎం అభ్య‌ర్థిగా ఎంపిక చేస్తార‌ని తెలిపారు. పంజాబ్ కు ఇప్పుడు బ‌ల‌మైన నాయ‌కుడు కావాల‌ని, ఆయ‌న ఎవ‌రో మీరే తేల్చుకోవాల‌ని పంజాబ్ ఓట‌ర్ల‌ను ఉద్దేశించి ఇటీవ‌ల సిద్దూ కామెంట్స్ చేశారు. 

ఈ వివాదానికి స్వ‌స్తి ప‌ల‌కడానికి కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ పూనుకున్నారు. గ‌త ఎన్నిక‌ల ర్యాలీ స‌మ‌యంలో పంజాబ్ కు వ‌చ్చిన ఆయ‌న ఫిబ్ర‌వ‌రి 6వ తేదీన చేప‌ట్టే స‌భ‌లో సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. ఈ విష‌యంపై అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే ఆదివారం జ‌రిగిన స‌భ‌లో చ‌న్నీ నే కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి అని ప్ర‌క‌టించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ప‌డింది. 

అలాంటి వ్యక్తి మాత్రమే కాంగ్రెస్‌కు దొరికాడా ? - ఆమ్ ఆద్మీ పార్టీ... 
మూడు కోట్ల మంది పంజాబీలలో అక్రమ మైనింగ్, బదిలీ పోస్టింగ్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థిగా గుర్తించడం బాధాకర‌మ‌ని అని ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) నేత రాఘవ్ చద్దా (raghav chadda) అన్నారు.  ‘‘ మేనళ్లుడి ఇంట్లో రూ.10 కోట్ల నగదు, విలాసవంతమైన కార్లు ఉన్నాయని సోదాల్లో తేలింది. ఎవరి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందో ఆమ్ ఆద్మీ పార్టీ బయటపెట్టింది. అలాంటి అభ్యర్థిని సీఎంగా ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 3 కోట్ల మంది పంజాబీలలో కాంగ్రెస్‌కు అలాంటి వ్యక్తి మాత్రమే దొరికాడా ? 111 రోజులు అవినీతి చేయకుండా జీవించలేని వ్యక్తి దొరికాడు?" అని చద్దా ఓ సెల్ఫీ వీడియోలో తెలిపారు.  పంజాబ్‌లో ఫిబ్రవరి 20వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 20వ తేదీన‌ ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu