
Navjot Sidhu: పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కష్టాలు తీవ్రమయ్యాయి. ఆయనపై నిత్యం ఏదొక ఆరోపణలు వస్తునే ఉన్నాయి. తాజాగా సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ హరీష్ చౌదరి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కోరారు. సిద్ధూపై ఫిర్యాదు చేస్తూ ఏప్రిల్ 23న సోనియాకు ఆయన లేఖ రాశారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయన పరిశీలించిన అంశాలను అందులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ విషయం ఆమోదించబడింది. పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ హరీష్ చౌదరి, రాష్ట్ర అధ్యక్షుడు అమరీందర్ సింగ్ బ్రార్ పార్టీ హైకమాండ్ , క్రమశిక్షణా కమిటీకి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సునీల్ జాఖర్, కేవీ థామస్‌లపై చర్యలు తీసుకున్నారు.
పార్టీకి వ్యతిరేకంగా నడుస్తున్నారని ఆరోపణలు
నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరంతరం పార్టీ శ్రేణికి వ్యతిరేకంగా నడుస్తున్నారనీ, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ బ్రార్ (రాజా వారింగ్) కూడా అతనికి ఒక నోట్ రాశారు. పార్టీ హైకమాండ్‌కు కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ హరీష్ చౌదరి రాసిన లేఖలో, 'నవజ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా ఒక నోట్ రాశారు. రాష్ట్రంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ నవంబర్ నుంచి సిద్ధూ కాంగ్రెస్ నిర్ణయాలను నిరంతరం ప్రశ్నిస్తున్నట్లు గుర్తించారు. తన ప్రకటనలతో పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు వాతావరణాన్ని సృష్టించారన్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగింపు
పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూను తొలగించింది. దీని తర్వాత, పంజాబ్‌లోని చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేసిన అమరీందర్ సింగ్ బ్రార్ (రాజా వారింగ్)ని పంజాబ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. దీంతో పాటు ఈసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో గిద్దర్‌బాహా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కాగా, సిద్ధూ ప్రస్తుత కార్యక్రమాలకు సంబంధించి పంజాబ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ రాజా వారింగ్ నుంచి సవివరణ నోట్‌ను కూడా సోనియా గాంధీకి పంపినట్లు పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ హరీష్ చౌదరి తెలిపారు. పార్టీకి అతీతంగా భావిస్తున్న ఆయన క్రమశిక్షణను ఉల్లంఘించి మిగతా వారికి ఉదాహరణగా నిలుస్తున్నారని విమర్శించారు. అందుకే సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో అన్న దానిపై ఆయన నుంచి వివరణ కోరాలని సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. అయితే ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారమని మీడియాతో ఆయన అన్నారు.