పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య మలుపు: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా

By Siva KodatiFirst Published Sep 28, 2021, 3:13 PM IST
Highlights

పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీలో సంక్షోభం నేపథ్యంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది అధిష్టానం. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి షాకిచ్చారు.
 
ఈ ఏడాది జూలై 18న పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నియమితులయ్యారు. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూని నియమిస్తున్నట్టు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. సిద్ధూతో పాటు మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు వెలువరించారు. ఆయన నియామకం ద్వారా ఎన్నికలకు 6 నెలల ముందు హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లయ్యింది. 

సిద్ధూకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. పార్టీ అధిష్ఠానం సుముఖంగా ఉన్నప్పటికీ అప్పటి సీఎం అమరీందర్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఓ లేఖను కూడా రాశారు. పంజాబ్ విషయంలో అధిష్టానం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని సీనియర్లను విస్మరించారని లేఖలో దుయ్యబట్టారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి కష్టమేనని మాజీ సీఎం తెగేసి చెప్పారు. అయితే రాష్ట్ర పార్టీలోని పరిణామాల నేపథ్యంలో అమరీందర్ సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. 

ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సిద్ధూపై సంచలన వ్యాఖ్యలు చేశారు అమరీందర్‌ సింగ్‌. ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ను సీఎంని కానివ్వబోనన్నారని తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూని కచ్చితంగా ఓడిస్తానని కెప్టెన్ స్పష్టం చేశారు. సిద్ధూ ప్రమాదకర వ్యక్తి అని.. ఆయనపై బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెడతానని అమరీందర్ సింగ్ ప్రకటించారు. సిద్ధూతో పంజాబ్‌కు, ఈ దేశానికే ప్రమాదమన్న కెప్టెన్‌.. ఆయన్ను సీఎం కానీయకుండా అడ్డుకొనేందుకు ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమేనని తేల్చిచెప్పారు.

click me!