Mamata banerjee: భవానీపూర్ ఉప ఎన్నిక రద్దు పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశం

By telugu teamFirst Published Sep 28, 2021, 1:12 PM IST
Highlights

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ ఉపఎన్నిక ఇప్పుడు రద్దు చేసి వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌పై కోట్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు వెల్లడించింది. ఎన్నికల సంఘం ప్రకటన మేరకే ఈ ఎన్నికలు జరుగుతాయని, ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని స్పష్టం చేసింది.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేయనున్న భవానీపూర్ నియోజకవర్గ ఉపఎన్నిక రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 4న ప్రకటన చేసిందని వివరించింది. ప్రస్తుత దశలో ఈ ఉపఎన్నిక నిలిపేయాలని ఆదేశించడానికి సరైన కారణాలు కనిపించట్లేవని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతుందని తీర్పుచెప్పింది. అయితే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై మండిపడింది.

భవానీపూర్ ఉపఎన్నికపై సయాన్ బెనర్జీ ఓ పిటిషన్ దాఖలు చేశారు. వీలైనంత తొందరగా భవానీపూర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించాలని, లేదంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ రాశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆ లేఖ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపారు. కాబట్టి, ఈ ఉపఎన్నికను వాయిదా వేయాలని ఆదేశించాల్సిందిగా హైకోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై ఎన్నికల సంఘం స్పందిస్తూ పిటిషనర్ వాదనలు ఈసీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహించింది. రాజ్యాంగ అత్యవసరస్థితిని ఆయన తప్పుగా అర్థం చెబుతున్నారని తెలిపింది. ఈ తీర్పునిస్తూ కోల్‌కతా హైకోర్టు సీఎస్‌పై సీరియస్ అయింది. ఆయన ప్రజాసేవకుడని, చట్టబద్ధంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించాలని హితవు పలికింది. అంతేకానీ, అధికారంలోకి రావడానికి ఏ వ్యక్తికి ఆయన సహకరించాల్సిన పనిలేదని వివరించింది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి సువేందు అధికారిపై ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే భవానీపూర్ నుంచి ఆమె పోటీ చేయడానికి అనుకూలంగా అక్కడ గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఈ స్థానంతోపాటు మరో రెండు చోట్ల ఈ నెల 30న ఉపఎన్నికలు జరగనున్నాయి. మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి 2011, 2016లలో ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆమె కొనసాగడానికి ఆరు నెలల్లోపు ఆమె శాసన సభ లేదా మండలి సభ్యురాలు కావాల్సిన అవసరముంది.

click me!