
చండీగడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది. ఇందులో మరోసారి సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పేరు కనిపించింది. అంటే వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు స్పష్టమైంది. సీఎం చన్నీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారనే చర్చ కొన్ని రోజులుగా జరుగుతున్నది. తాజా అభ్యర్థుల జాబితాతో ఆ వాదన నిజమైంది. ఈ నెల 15వ తేదీన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ చంకౌర్ సాహిబ్ ఎస్‌సీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. తాజాగా, ఆయన మరో స్థానం భదౌర్ నుంచి బరిలోకి దించబోతున్నట్టు పార్టీ తాజా అభ్యర్థుల జాబితాలో ప్రకటించింది.
పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పటియాలా మేయర్ విష్ణు శర్మను కాంగ్రెస్ పార్టీ పటియాల నుంచి బరిలోకి దిగుతున్న మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పోటీకి దింపింది. కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ తనయుడు మనిష్ బన్సాల్ బర్నాలా అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాగా, శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా మోహన్ సింగ్ ఫలియన్‌వాలా బరిలోకి దిగుతున్నారు.
లూదియాన సౌత్ నుంచి ఇశ్వర్ జోత్ సింగ్ చీమా పోటీ చేయనున్నారు. ఖేమ్ కరణ్ నుంచి సుఖ్‌పాల్ సింగ్ బుల్లార్ పోటీ చేస్తున్నారు. అట్టారి ఎస్సీ స్థానం నుంచి తర్సెమ్ సింగ్ సియాలా, నవన్ షాహర్ నుంచి సత్బీర్ సింగ్ సైనీ బలిచికి పోటీ చేస్తారు. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ మార్చి 10వ తేదీన జరగనున్నాయి.
ఇదిలా ఉండగా పంజాబ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని రాహుల్ గాంధీ ఈ నెల 27వ తేదీన అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. పంజాబ్ ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఈ నిర్ణయం తీసుకుందామని వివరించారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని(CM Candidate) ఎలా నిర్ణయించుకుందాం? అని ప్రశ్నించారు. మళ్లీ ఆయనే సమాధానం ఇస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలే తమ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని తెలిపారు. సీఎం అభ్యర్థిని నిర్ణయించుకోవడం వారి చేతుల్లోనే పెడుతున్నామని పేర్కొన్నారు. జలందర్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఒక పార్టీని ఇద్దరు లీడ్ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఎవరో ఒకరే పార్టీకి నాయకత్వం వహించడం సరైన మార్గం అని తెలిపారు. ఒకరు నాయకత్వం వహిస్తే.. మరొకరు.. ఇతరులు అందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని చెప్పారు. రాహుల్ గాంధీ ఈ నెల 27వ తేదీన పంజాబ్ పర్యటించిన సంగతి తెలిసిందే.