ఉరి తీస్తారు.. తల తీస్తారు, రాళ్లతో కొడతారు: రేప్‌ చేస్తే ఆయా దేశాల్లో శిక్షలు

By sivanagaprasad KodatiFirst Published Dec 4, 2019, 4:17 PM IST
Highlights

దిశపై అత్యాచారం, దారుణహత్య నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడిన కామాంధులను దారుణంగా శిక్షించాలని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి

దిశపై అత్యాచారం, దారుణహత్య నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడిన కామాంధులను దారుణంగా శిక్షించాలని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఒకదశలో నిందితులను ఉంచిన షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన ప్రజలు వారిని తమకు అప్పగిస్తే.. చంపేస్తామంటూ ధర్నాకు దిగారు.

ఈ రకంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకోగా మేధావులు, సెలబ్రిటీలు సైతం ఆ దుర్మార్గులకు ఉరే సరైన నిర్ణయమని చెబుతున్నారు. ఈ క్రమంలో అత్యాచార ఘటనలకు ప్రపంచంలోని వివిధ దేశాలు ఎలాంటి శిక్షలు అమలు చేస్తున్నాయో ఒకసారి చూద్దాం.

Also Read:జస్టిస్ ఫర్ దిశ: కీలక ఆధారాలు లభ్యం,ఫోరెన్సిక్ ల్యాబ్‌కు

సౌదీ అరేబియా: గతంలో ఇక్కడ రేప్ చేసిన నిందితులను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేవారు. ఆ తర్వాత నేరస్థుడికి మత్తు మందు ఇచ్చి బహిరంగంగా తల నరికి వేసేవారు. అయితే మారిన పరిస్ధితుల నేపథ్యంలో సౌదీలోనూ కఠిన శిక్షలు విధించడం లేదు. నేరం రుజువైన పక్షంలో బహిరంగంగా 80 నుంచి 1000 కొరడా దెబ్బలు, పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు.

ఇరాన్: అత్యాచార ఘటనలకు ఈ దేశంలో ఉరి శిక్షను విధిస్తున్నారు. అక్కడ ఉరిశిక్షలను విధిస్తున్న కేసుల్లో పదిహేను శాతం వరకు రేప్ కేసులే ఉంటున్నాయి. అయితే బాధితులు నష్టపరిహారం తీసుకుని నిందితులను క్షమించిన పక్షంలో వంద కొరడా దెబ్బలు, సాధారణ జైలు శిక్షను విధిస్తున్నారు.

ఇజ్రాయిల్: ఈ తరహా కేసుల్లో కనిష్టంగా నాలుగేళ్లు, గరిష్టంగా 16 ఏళ్లు జైలు శిక్షను విధిస్తున్నారు. గతంలో రేప్‌కు గురైన వారిని నేరస్థులు వివాహం చేసుకుంటే శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఎక్కువగా కారాగారావాసాన్ని విధిస్తున్నారు.

చైనా: గతంలో ఓ సామూహిక అత్యాచార ఘటనలో నలుగురికి మరణశిక్ష విధించిన తర్వాత వారు నిర్దోషులని తేలడంతో ప్రభుత్వం శిక్షల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 

రష్యా: రేప్ కేసుల్లో మూడు నుంచి ఆరేళ్లు జైలు శిక్ష విధిస్తారు. రేప్ కారణంగా బాధితురాలు మరణిస్తే 8 నుంచి 15 ఏళ్ల వరకు శిక్ష పెరుగుతుంది. ఒకవేళ బాధితులు మైనర్లయితే వారికి నాలుగు నుంచి పదేళ్ల వరకు శిక్షలు పెరుగుతాయి. 

నెదర్లాండ్స్: ఇక్కడ రేప్‌లే కాకుండా లైంగిక వేధింపులు, బలవంతంగా ముద్దు పెట్టుకున్నా రేప్‌గానే పరిగణిస్తారు. ఇందుకు నాలుగేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధిస్తారు. వేశ్యలను వేధించినా ఇదే తరహా శిక్షలను అమలు చేస్తారు. 

ఫ్రాన్స్: 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ బాధితుడు మైనర్లు అయితే 20 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు. బాధితురాలు తీవ్రంగా గాయపడినా, మరణించినా 30 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధిస్తారు.

Also Read:‘దిశ’ను బతికుండగానే కాల్చారు... జైల్లో ప్రధాన నిందితుడు

పైన పేర్కొన్న దేశాలతో పాటు ఈజిప్ట్, యూఏఈలలో అత్యాచారం చేసిన వారికి ఉరి శిక్షను అమలు చేస్తారు. దుబాయ్‌లో ఈ తరహా ఘటనల్లో నేరం జరిగిన ఏడు రోజుల్లో ఉరి తీస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అయితే నేరస్థులను తుపాకీతో తలలో కాల్చి చంపుతారు. అరెస్ట్ చేసిన నాలుగు రోజుల్లోనే ఈ శిక్షను అమలు చేస్తారు. 
 

click me!