
పుదుచ్చెరి: ఆమె ఓ రాష్ట్రానికి గవర్నర్...మరో కేంద్రపాలిత ప్రాంతానికి లెప్టినెంట్ గవర్నర్(ఇంచార్జి). రాజ్ నివాస్ నుండి అడుగు బయటపెట్టాల్సిన అవసరమే లేదు. కానీ రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన ఆమె ప్రజలకు దూరంగా వుండలేకపోయారు. దీంతో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సామాన్యులతో మమేకమవుతూ సాధారణ వ్యక్తిలా బస్సులో నిల్చుని ప్రయాణం చేశారు. ఆమే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రభుత్వం కుప్పకూలడంతో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. దీంతో ఇంచార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోను సామాన్యుల సమస్యలను తెలుసుకునేందుకు రాజ్ నివాస్ నుండి బయటకువచ్చిన లెప్టినెంట్ గవర్నర్ మంగళవారం బస్సులో పయనించారు. పుదుచ్చేరిలోని అంతోనియార్ బస్టాండ్ లో బర్గూర్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఎక్కారు తమిళిసై. ముందు సీటులో కూర్చున్న ఆమె ప్రయాణికులతో మాటలు కలిపారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత తవలకుప్పంలో మరోబస్సు ఎక్కి ప్రయాణించారు తమిళిసై. అప్పటికే ఆ బస్సులో సీట్లు పూర్తిగా నిండి ఉండటంతో నిల్చుని ప్రయాణించారు. ఆమెను గుర్తించిన అనేక మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడంతో పాటు వ్యక్తిగత సమస్యలతో పాటు రోడ్లు, నీటి సమస్యలను తెలియజేశారు. రాజ్ నివాస్ కు వచ్చి కలవాలని... ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తమిళిసై హామీ ఇచ్చారు.