Latest Videos

ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడండి: రాష్ట్రపతికి మమతా బెనర్జీ విజ్ఞప్తి

By Mahesh RajamoniFirst Published Mar 28, 2023, 10:09 AM IST
Highlights

Kolkata: ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడాల‌ని రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి కి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగాన్ని, దేశంలోని పేద ప్రజల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని ఆమె కోరారు.
 

West Bengal Chief Minister Mamata Banerjee: దేశ రాజ్యాంగాన్ని, పౌరుల రాజ్యాంగ హక్కులను కాపాడాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. ముర్ముకు జరిగిన పౌర స్వాగత కార్యక్రమంలో మమతా బెనర్జీ ఆమెను 'గోల్డెన్ లేడీ'గా కొనియాడారు. వివిధ వర్గాలు, కులాలు, మతాలకు చెందిన ప్రజలు తరతరాలుగా సామరస్యంగా జీవిస్తున్న దేశం గర్వించదగ్గ వారసత్వాన్ని కలిగి ఉందని మమతా బెనర్జీ కొనియాడారు. 'మేడమ్ ప్రెసిడెంట్, మీరు ఈ దేశానికి రాజ్యాంగ అధిపతి. రాజ్యాంగాన్ని, ఈ దేశంలోని పేద ప్రజల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని కోరుతున్నాను. విపత్తు నుంచి దేశాన్ని కాపాడాలని కోరుతున్నాం' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాష్ట్రపతికి దుర్గామాత విగ్రహాన్ని బహూకరించిన మమతా బెనర్జీ ఈ కార్యక్రమంలో గిరిజన డప్పు వాయిస్తూ గిరిజనులతో కలిసి నృత్యం కూడా చేశారు.

పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, ప్రజలకు సాదర స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపిన రాష్ట్రపతి త్యాగం, ధైర్యం, సంస్కృతి, విద్య రాష్ట్ర జీవన ఆదర్శాలని పేర్కొన్నారు. "బెంగాల్ ప్రజలు సంస్కారవంతులు, అభ్యుదయవాదులు. బెంగాల్ గడ్డ ఒకవైపు అమర విప్లవకారులకు, ఎంద‌రో ప్రముఖ శాస్త్రవేత్తలకు జన్మనిచ్చింది. రాజకీయాల నుండి న్యాయ వ్యవస్థ వరకు, సైన్స్ నుండి తత్వశాస్త్రం వరకు, ఆధ్యాత్మికత నుండి క్రీడల వరకు, సంస్కృతి నుండి వ్యాపారం వరకు, జర్నలిజం నుండి సాహిత్యం, సినిమా, సంగీతం, నాటకం, చిత్రలేఖనం.. ఇతర కళా రూపాల వరకు, బెంగాల్ అద్భుతమైన మార్గదర్శకులు అనేక రంగాలలో కొత్త మార్గాలు- పద్ధతులను కనుగొన్నార‌ని" పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం వంటి ఆదర్శాలకు బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నారని ముర్ము అన్నారు.

బ్రిటిష్ వలస పాలనను, అవినీతి జమీందారీ వ్యవస్థను గద్దె దించడానికి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సంతాల్ నాయకుల జ్ఞాపకార్థం కోల్ కతాలోని ఒక వీధికి 'సిడో-కన్హు-దహర్' అని పేరు పెట్టడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మన స్వాతంత్య్ర‌ పోరాట ఆదర్శాలకు బలాన్నిస్తాయని, ముఖ్యంగా గిరిజన సోదర సోదరీమణుల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి బలం చేకూరుస్తాయని ఆమె అన్నారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతాజీ సుభాష్ చంద్రబోస్ పూర్వీకుల నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. రెండు రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ముర్ము ప్రస్తుతం స్మారక చిహ్నంగా ఉన్న 'నేతాజీ భవన్' చుట్టూ తిరుగుతూ దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన అనేక సంఘటనలకు సాక్షిగా ఉన్న ఈ చారిత్రక భవనం ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.

click me!