2047 కల్లా భారత దేశంలో ఇస్లాం పాలన రావాలనేదే పీఎఫ్ఐ లక్ష్యం.. కిల్లర్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసుకుంది: ఎన్‌ఐఏ

By Mahesh KFirst Published Jan 21, 2023, 2:04 PM IST
Highlights

కర్ణాటకలో బీజేపీ యువమోర్చా సభ్యుడు ప్రవీణ్ నెట్టారు హత్యకు సంబంధించి ఎన్ఐఏ శుక్రవారం ఓ స్పెషల్ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేసింది. ఈ చార్జిషీటులో పీఎఫ్ఐ, దాని సర్వీస్ టీమ్‌ల గురించి సంచలన ఆరోపణలు చేసింది. ప్రవీణ్ నెట్టారును పెద్ద కుట్రలో భాగంగా చంపేశారని పేర్కొంది. 2047 కల్లా మన దేశంలో ఇస్లాం పాలన స్థాపించాలనేదే వారి లక్ష్యం అని వివరించింది.
 

న్యూఢిల్లీ: నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మన దేశంలో ఇస్లాం పాలన తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తన చార్జిషీటులో పేర్కొంది. 2047 కల్లా మన దేశంలో ముస్లిం పాలన స్థాపించాలని నిర్ణయించుకుందని ఆరోపించింది. ఇందుకోసం పీఎఫ్ఐ ప్రత్యేకంగా రహస్య బృందాలను ఏర్పాటు చేసుకుందని, అవి సర్వీస్ టీమ్‌లు లేదా కిల్లర్ స్క్వాడ్‌లు అని వివరించింది. తాము నిర్దేశించుకున్న శత్రువులను అనుకున్నట్టుగా ఈ బృందాలు అంతమొందిస్తాయని తెలిపింది.

బెంగళూరులోని ఓ ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్ఐఏ చార్జిషీట్ శుక్రవారం ఫైల్ చేసింది. బీజేపీ యువమోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్ నెట్టారును గతేడాది జులై 26న అతి దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. దక్షిణ కన్నడ జిల్లా సల్లియా తాలూకాలోని బల్లారి గ్రామంలో ఈ హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి తాజాగా ఎన్ఐఏ చార్జిషీట్ ఫైల్ చేసింది. ఈ చార్జిషీట్‌లో పీఎఫ్ఐ పై సంచలన అభియోగాలు మోపింది. ప్రవీణ్ నెట్టారును బహిరంగంగా, అత్యంత దారుణంగా హతమార్చి ఒక వర్గాన్ని భయాందోళనలకు గురి చేయాలని పీఎఫ్ఐ సంకల్పించిందని వివరించింది. 

Also Read: పీఎఫ్ఐ పట్ల ముస్లిం విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి - ముస్లిం రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ మౌలానా సుహైబ్

పీఎఫ్ఐకి చెందిన 20 మంది సభ్యులపై చార్జిషీట్ ఫైల్ అయింది. ఈ చార్జిషీటులో పీఎఫ్ఐ, దాని సర్వీస్ టీమ్‌ల గురించి, వాటి లక్ష్యాల గురించి పేర్కొంది. పీఎఫ్ఐ సర్వీస్ టీమ్ సభ్యులకు ఆయుధ శిక్షణ, దాడులకు శిక్షణ, నిఘా టెక్నిక్ ట్రైనింగ్, లక్ష్యాన్ని గుర్తించడం, ఒంటరిగా ఉన్నవారిని, కొన్ని వర్గాలకు చెందిన సమూహాలను టార్గెట్ చేయడంపై టెక్నిక్‌లపై శిక్షణ ఇస్తారని వివరించింది. సీనియర్ పీఎఫ్ఐ సభ్యుల సూచనల మేరకు నిర్దేశించుకున్న వారిని సర్వీస్ టీమ్ సభ్యులు చంపేస్తారు.

సీనియర్ సభ్యుల సూచనల మేరకు నలుగురు వ్యక్తులపై రెక్కీ నిర్వహించారని, అందులో బీజేపీ యువ మోర్చా సభ్యుడు ప్రవీణ్ నెట్టారును గతేడాది జులై 26న బహిరంగంగా పదునైన ఆయుధంతో చంపేశారని ఎన్ఐఏ ఆరోపించింది. ఒక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికే, భయపెట్టడానికే ఈ హత్య చేసినట్టు వివరించింది. 

చార్జిషీట్ దాఖలైన 20 మంది సభ్యుల్లో ఆరుగురు పరారీలో ఉన్నారని, వారిపై రివార్డులను ప్రకటించామని వివరించింది. వారి అరెస్టుకు దోహదపడే సమాచారం ఇస్తే బహుమతి ఇస్తామని పేర్కొంది.

click me!