దేశాన్ని విభజించే, విచ్ఛిన్నం చేసే రాజకీయం నడుస్తోంది.. నా సోదరుడిది ఆధ్యాత్మిక యాత్ర: ప్రియాంక గాంధీ

By Sumanth KanukulaFirst Published Jan 30, 2023, 1:47 PM IST
Highlights

దేశాన్ని విభజించే, విచ్చిన్నం చేసే రాజకీయం నడుస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మేలు చేసే విధంగా లేవని తాను చెప్పగలనని అన్నారు.

దేశాన్ని విభజించే, విచ్చిన్నం చేసే రాజకీయం నడుస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మేలు చేసే విధంగా లేవని తాను చెప్పగలనని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లోని షేర్-ఏ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. భారీగా మంచు కురుస్తున్న లెక్కచేయకుండా నేతలు ప్రసంగాలు కొనసాగించారు. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో డీఎంకే, జేఎంఎం, బీఎస్పీ, ఎన్‌సీ, పీడీపీ, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, వీసీకే, ఐయూఎంఎల్‌ల నేతలు కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తన సోదరుడు రాహుల్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని.. రాహుల్ ఎక్కడికి వెళ్లినా అతడి కోసం జనం బారులు తీరారని చెప్పారు. దేశం కోసం, ఈ భూమి కోసం, దాని వైవిధ్యం కోసం భారతీయులందరి హృదయాల్లో ఇప్పటికీ ఒక అభిరుచి ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. 

‘‘నా సోదరుడు కాశ్మీర్‌కు వస్తున్నప్పుడు, అతను మా అమ్మకు, నాకు సందేశం పంపాడు. అతను ఇంటికి వెళ్తున్నాననే ప్రత్యేకమైన అనుభూతిని కలిగి ఉన్నాడని చెప్పారు. అతని కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారని అన్నారు. వారు వచ్చి కన్నీళ్లతో అతన్ని కౌగిలించుకున్నారు. వారి బాధ, భావోద్వేగాలు అతని హృదయంలోకి ప్రవేశించాయి. 

ఇక్కడ నిలబడి.. దేశంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మేలు చేయలేవని చెప్పగలను. అది దేశాన్ని విభజించే, విచ్ఛిన్నం చేసే రాజకీయం. అందుకే ఒక విధంగా ఇది ఆధ్యాత్మిక యాత్ర’’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. 

ఇక, ఈ సభలో సీపీఐ నేత డీ రాజా ప్రసంగిస్తూ దేశంలోని లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం అందరం కలిసి పోరాడి బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేశామని అన్నారు. ఇప్పుడు బీజేపీ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సెక్యులర్ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. 

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని దేశం పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకు మరో యాత్ర చేపట్టాలని కోరారు. తాను కూడా ఆయనతో కలిసి నడవాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. తాను, తన తండ్రి, తమ పార్టీ తరపున రాహుల్ గాంధీని అభినందిస్తున్నానని చెప్పారు. రాహుల్ యాత్ర విజయవంతం అయిందని అన్నారు. ఇక, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీలో దేశం ఆశాకిరణాన్ని చూస్తోందన్నారు.

click me!