సీఎం క్యాండిడేట్‌గా ప్రియాంక గాంధీ? కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే..

By telugu teamFirst Published Sep 19, 2021, 1:49 PM IST
Highlights

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కసరత్తుల్లో మునిగాయి. ఐదు రాష్ట్రాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ప్రియాంక గాంధీ సారథ్యంలోనే పోరాడుతామని, అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపైనా ఆమెనే నిర్ణయం తీసుకుంటారని వివరించారు. స్వయంగా ఆమె కూడా సీఎం క్యాండిడేట్‌గా దిగవచ్చని, అదీ ఆమె నిర్ణయమేనని పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ సారథ్యంలోనే కాంగ్రెస్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెప్పారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ సల్మాన్ ఖుర్షీద్ సీఎం క్యాండిడేట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె సారథ్యంలోనే ఎన్నికల బరిలోకి దిగుతున్నామని, సీఎం అభ్యర్థిత్వంపై ఆమెనే నిర్ణయం తీసుకుంటారని వివరించారు. కావాలనుకుంటే ఆమెనే సీఎం క్యాండిడేట్‌గా బరిలోకి దిగవచ్చని పేర్కొన్నారు.

‘యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రియాంక గాంధీ వాద్రా సారథ్యంలోనే పోరాడుతాం. సీఎం క్యాండిడేట్‌ ఎవరనే నిర్ణయాన్ని ఆమెనే తీసుకుంటారు. స్వయంగా ఆమెనే సీఎం క్యాండిడేట్‌గా ఉండాలా? అనే విషయాన్నీ ఆమెనే నిర్ణయించుకుంటారు’ అని సల్మాన్ ఖుర్షీద్ వివరించారు. 

పార్టీ నాయకత్వంపైనా సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడారు. ‘మాకు ఇప్పటికే పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఇంకో అధ్యక్షులు అవసరం లేదు. ప్రస్తుత అధ్యక్షత్వంపై మేం సంతృప్తిగా ఉన్నాం. కానీ, కాంగ్రెస్ వెలుపలి వ్యక్తులే అసంతృప్తితో రగులుతున్నట్టు తెలుస్తున్నది’ అని వివరించారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు యూపీ ఎలక్షన్స్‌ను ప్రీఫైనల్‌గా భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే పలు సంక్షేమ పథకాలను ప్రకటించడంతోపాటు చాకచక్యంగా వ్యవహరిస్తున్నది. అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ సార్వత్రిక ఎన్నిల్లో కీలక రాష్ట్రం.

click me!