పంజాబ్ సీఎంగా నేను చేయలేను: కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన అంబికా సోని.. నెక్స్ట్ సీఎం రేసులో వీరే..

By telugu teamFirst Published Sep 19, 2021, 12:35 PM IST
Highlights

పంజాబ్ సీఎంగా తాను చేయలేనని కాంగ్రెస్ నేత అంబికా సోని స్పష్టం చేశారు. ఈ పదవికి ఓ సిక్కు నేతనే ఎంచుకోవాలనీ అభిప్రాయపడ్డారు. నిన్న రాత్రి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఆమెతో మాట్లాడారు. పంజాబ్ నూతన సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని ఆఫర్ చేయగా, అంబికా సోని తిరస్కరించినట్టు తెలిసింది. తదుపరి సీఎం రేసులో ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.

చండీగడ్: అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ పంజాబ్ యూనిట్‌లో సంక్షోభం తలెత్తింది. ఎన్నికల కోసం సమాయత్తం కావలసిన సమయంలో ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్‌పైనే ఫోకస్ పెట్టింది. తదుపరి సీఎం ఎంపిక కోసం కసరత్తులు చేస్తున్నది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత అంబికా సోనికి సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని అడిగింది. కానీ, ఆమె సున్నితంగా తాను పంజాబ్ సీఎంగా చేయలేనని చెప్పినట్టు తెలిసింది.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీలు ఆమెతో నిన్న రాత్రి మాట్లాడారు. పంజాబ్ సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని ఆఫర్ చేశారు. కానీ, ఆ ఆఫర్‌ను అంబికా సోని తిరస్కరించారు. పంజాబ్‌కు తదుపరి సీఎం ఒక సిక్కు నేతనే ఉండాలని అభిప్రాయపడ్డారు. తాను పంజాబ్‌కు లోతైన అనుబంధాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్న ఆమె తన మనోగతాన్ని ఆలకించి ఆఫర్ తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. తనకు ఇష్టం లేని పదవిని చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. ఆమెను ఒప్పించడానికి నవ్‌జోత్ సింగ్ సిద్దూ కూడా ప్రయత్నించినట్టు తెలిసింది.

పంజాబ్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం నుంచి ముగ్గురు అబ్జర్వర్లు రాష్ట్రానికి చేరారు. నూతన సీఎంపై అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వీరీ రిపోర్టు సమర్పించిన తర్వాతే తదుపరి సీఎంగాపై అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది.

తదుపరి సీఎం రేసులో వీరే?
కెప్టెన్ అమరీందర్ సింగ్ తర్వాత సీఎం పీఠం కోసం రేసులో ప్రధానంగా ముగ్గురి పేర్లు వినవస్తున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, ప్రస్తుత చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్దూ, మంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రంధావాలు నెక్స్ట్ సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తున్నది. వీరితోపాటు త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వాల పేర్లు వినిపిస్తున్నాయి. 

రాజీనామా చేసిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ తదుపరి సీఎంగా నవ్‌జోత్ సింగ్ సిద్దూ పేరును ఎంచుకోరాదని తన అభిప్రాయాన్ని తెలిపారు. నవ్‌జోత్ సింగ్ సిద్దూ ఆ పదవికి అనర్హుడని, తన ప్రభుత్వంలో ఆయన ఒక డిజాస్టర్ అని, ఆయనకు అప్పజెప్పిన ఒక్క మంత్రిత్వ శాఖనూ సరిగ్గా నిర్వహించలేకపోయాడని విమర్శించారు. ఏడు నెలలపాటు ఫైల్స్‌ను క్లియర్ చేయలేకపోయారని ఆరోపించారు. అంతేకాదు, ఒకవేళ ఆయన పేరును నూతన సీఎంగా ప్రకటిస్తే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లడానికీ వెనుకాడబోరని హెచ్చరించారు. నవ్‌జోత్ సింగ్ సిద్దూ అనుయాయుడి పేరును ప్రకటించినా బలపరీక్షకు డిమాండ్ చేస్తామని స్పష్టం చేశారు.

click me!