
Assembly Election 2022: ఈ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly election 2022) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు వేడేక్కాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఒక వైపు ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలు (Assembly Election), మరోవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. వివిధ రాజకీయ పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దం రాజకీయాలను వేడేక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వలసలు పెరగడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఫైర్ అయ్యారు.
కరోనావైరస్ సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నిర్వహించిన భారీ ర్యాలీల గురించి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు. వలసజీవులను మోడీ విడిచిపెట్టారనీ, కోవిడ్ సమయంలో ఇండ్లకు వెళ్లడానికి సౌకర్యాలు లేక వందలాది కిలోమీటర్లు కాలినడకను కొనసాగించారని తెలిపారు. వారికి సహాయం అందకూడదని ప్రధాని మోడీ కోరుకున్నారా? ఆయనకు ఏం కావాలి? మీరు చేసిన ర్యాలీల సంగతేంటి అంటూ ప్రశ్నించారు. "అతను (ప్రధాని మోడీ) విడిచిపెట్టిన వ్యక్తులు (వలస జీవులు), వారి ఇళ్లకు తిరిగి రావడానికి మార్గం లేని వ్యక్తులు, వందలాది కిలోమీటర్లు కాలినడకన తిరిగి వస్తున్నవారు - వారికి ఎవరూ సహాయం చేయకూడదని అతను (ప్రధాని మోడీ) కోరుకున్నాడా? మోడీ జీ ఏం కోరుకున్నారు? అతనికి ఏమి కావాలి? అతను చేసిన పెద్ద ర్యాలీల సంగతేంటి? ” అని ప్రశ్నించారు. సోమవారం నాడు గోవాలోని పనాజీలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ నిర్వహణలో మోడీ సర్కారు విఫలమైందని పేర్కొన్నారు. మొదటివేవ్ లో లక్షలాది మంది వలస జీవులు ప్రభావితం కావడానికి బీజేపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలే కారణమంటూ ఆరోపించారు.
కాగా, పార్లమెంట్‌లో జరుగుతున్న బడ్జెట్ సెషన్ లో భాగంగా లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో వలస సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత అని అన్నారు. “ఈ కోవిడ్-19 సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులను దాటిపోయింది. మొదటి వేవ్ సమయంలో, ప్రజలు లాక్‌డౌన్‌లను అనుసరిస్తున్నప్పుడు, ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి, కాంగ్రెస్ ముంబై స్టేషన్‌లో నిలబడి అమాయక ప్రజలను భయపెడుతోంది”అని ఆరోపించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా.. తీవ్ర స్థాయిలో మోడీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. వలస జీవుల సంక్షోభానికి క్షమాపణలు చెప్పే బదులు, వలస కార్మికులకు సహాయం చేసిన చేతులను పీఎం మోడీ ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "లాక్‌డౌన్ విధించడం ద్వారా కార్మికులు, వారి కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టిన వారు, 'క్షమాపణ' చెప్పడానికి బదులుగా, వలస కార్మికులకు సహాయం చేసిన చేతులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా లక్షలాది మంది తమ వారిని కోల్పోయారు, కానీ నేడు వారి బాధను పట్టించుకోకుండా పార్లమెంటులో సిగ్గులేకుండా నవ్వారు" అంటూ ఆయన ట్వీట్ చేశారు.