ఆర్టికల్ 370 (Article 370) రద్దు సరైనదే అని సుప్రీంకోర్టు తీర్పు (Supreme Court verdict) వెలువరించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్వాగతించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. భారతీయుల ఐక్యతా సారాన్ని కోర్టు బలపర్చిందని చెప్పారు.
Supreme Court verdict on Article 370 : ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నిర్ణయం సరైనదే అని, ఆ అధికారం రాష్ట్రపతికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై సర్వాత్ర హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు.
‘‘ఆర్టికల్ 370 రద్దుపై నేటి సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనది. 2019 ఆగస్టు 5 న భారత పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పు సమర్థిస్తోంది. ఇది జమ్మూ, కాశ్మీర్, లడఖ్ లోని మన సోదరీసోదరీమణులకు ఆశ, పురోగతి, ఐక్యత కు గొప్ప ప్రకటన. భారతీయులుగా మనం అన్నిటికన్నా ప్రియమైన, గౌరవించే ఐక్యతా సారాన్ని కోర్టు తన లోతైన జ్ఞానంతో బలపరిచింది.’’ అని ప్రధాని నరేంద్ర మోడీ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో పేర్కొన్నారు.
అదే పోస్టులో ‘‘మీ కలలను సాకారం చేసుకోవడానికి మా నిబద్ధత అచంచలంగా ఉందని జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రజలకు భరోసా ఇస్తున్నాను. ప్రగతి ఫలాలు మీకు చేరడమే కాకుండా, ఆర్టికల్ 370 వల్ల నష్టపోయిన సమాజంలోని అత్యంత బలహీన, అణగారిన వర్గాలకు కూడా వాటి ప్రయోజనాలను అందించాలని మేము నిశ్చయించుకున్నాము.’’ అని తెలిపారు.
Today's Supreme Court verdict on the abrogation of Article 370 is historic and constitutionally upholds the decision taken by the Parliament of India on 5th August 2019; it is a resounding declaration of hope, progress and unity for our sisters and brothers in Jammu, Kashmir and…
— Narendra Modi (@narendramodi)ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం న్యాయపరమైన తీర్పు మాత్రమే కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇది ఒక ఆశాదీపమని, ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం, బలమైన, మరింత ఐక్యమైన భారతదేశాన్ని నిర్మించాలనే తమ సమిష్టి సంకల్పానికి నిదర్శనం అని అన్నారు. ఈ పోస్టు చివరిలో NayaJammuKashmir అని యాష్ ట్యాగ్ ఇచ్చారు.
కాగా.. 2019 ఆగస్టు 5వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ కు త్వరలోనే మళ్లీ రాష్ట్ర హోదాను కల్పిస్తామని ఆ సమయంలో ప్రకటించారు. ఎన్నికల నిర్వహించిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అయితే ఆర్టికల్ 370 రద్దును పలువురు వ్యతిరేకించారు. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇన్నాళ్లుగా వాదనలు కొనసాగాయి. సోమవారం తుది తీర్పు వెలువరించింది. అందులో కేంద్ర నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. అలాగే 2024 సెప్టెంబర్ లోగా జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.