పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఇన్‌స్పెక్టర్ చాటింగ్, అనుచిత ప్రవర్తన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో..

By Sumanth KanukulaFirst Published Mar 22, 2023, 4:27 PM IST
Highlights

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు  చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళతో అతడు అసభ్యంగా  ప్రవర్తించాడు

బెంగళూరు: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు  చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళతో అతడు అసభ్యంగా  ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే పోలీసుల ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్ చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు బుధవారం తెలిపారు. వివరాలు.. నిందితుడు రాజన్న కర్ణాటక బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత నెలలో రూ. 15 లక్షలు మోసపోయామని ఓ మహిళ కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదును స్వీకరించిన ఇన్‌స్పెక్టర్.. ఆమెకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు

అయితే ఇన్‌స్పెక్టర్ ఆమె ఫోన్ నంబర్ తీసుకుని కొన్ని రోజుల తర్వాత ఆమెతో చాట్ చేయడం ప్రారంభించాడు. ఆమెకు బహుమతులు కూడా పంపాడు. అనుచితంగా  ప్రవర్తించాడు. మహిళను తనను వ్యక్తిగతంగా కలవాలని కూడా కోరాడు. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు.. నిందితుడి ప్రవర్తన భరించలేక డీసీపీకి ఫిర్యాదు చేసింది.తనను పోలీస్ స్టేషన్‌కు పిలిచిన తర్వాత ఇన్‌స్పెక్టర్ తనకు డ్రై ఫ్రూట్స్‌తో కూడిన కవర్‌ను, గది తాళాన్ని ఇచ్చాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన డీసీపీ.. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఏసీపీని ఆదేశించారు.

ఈ మేరకు యలహంక సబ్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) సౌత్‌ఈస్ట్‌ డీసీపీ లక్ష్మీప్రసాద్‌కు నివేదిక సమర్పించారు. ఆ తర్వాత దర్యాప్తు నివేదికను ఇప్పుడు బెంగళూరు పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డికి పంపారు. ఇక, బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు సదరు పోలీసు ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కర్ణాటక పోలీసు శాఖ కూడా నిందితుడు రాజన్నపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

click me!