వారి చేష్టలు, వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయి: సభలో తృణమూల్ ఎంపీల తీరుపై మోడీ ఆగ్రహం

By Siva KodatiFirst Published Aug 3, 2021, 2:48 PM IST
Highlights

పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆక్షేపించారు. మంత్రి చేతుల్లోని పేపర్లను లాక్కుని చించేయడం, వాటిని స్పీకర్ మీదకు విసిరేయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.
 

ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలను సక్రమంగా సాగనివ్వకుండా పార్లమెంటును అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ ప్రజలను అవమానించారంటూ ప్రధాని మండిపడ్డారు. ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా వ్యవహరించాయని, నానా రభస చేస్తూ సభ వాయిదాలకు కారణమయ్యాయని మోడీ వ్యాఖ్యానించారు.

ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని ప్రధాని ఆక్షేపించారు. మంత్రి చేతుల్లోని పేపర్లను లాక్కుని చించేయడం, వాటిని స్పీకర్ మీదకు విసిరేయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. పేపర్లు చించిన ఎంపీకి కనీసం విచారం కూడా లేదని మోడీ దుయ్యబట్టారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతుల్లోని పేపర్లను లాక్కుని తృణమూల్ ఎంపీ శంతనూ సేన్ చించేసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు బిల్లులను పాస్ చేయడంపై తృణమూల్ పార్టీకే చెందిన మరో ఎంపీ డెరెక్ ఓ బ్రయన్ చేసిన వ్యాఖ్యలపైనా ప్రధాని మండిపడ్డారు. అవి దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. బిల్లులు పాస్ చేస్తున్నారా? లేదంటే ‘పాప్రి చాట్’ చేస్తున్నారా? అంటూ డెరెక్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ ఎంఏ నఖ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులను త్వరితగతిన పాస్ చేయాలని తమకూ లేదని, చర్చకు సిద్ధంగానే ఉన్నామని తేల్చి చెప్పారు. బాధ్యతారహితమైన వ్యాఖ్యలతో పార్లమెంట్ ను అవమానించిన తృణమూల్ ఎంపీ.. దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

click me!