
తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సద్గురు జగ్గీ వాసుదేవన్ ఆధ్వర్యంలో వేడుకలు కనీవినీ ఎరుగనిరీతిలో జరుగుతాయి. తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దేశ విదేశాల నుంచి ప్రముఖులతోపాటు వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ అతిథిగా హాజరై.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీటితో పాటు తమిళనాడు గవర్నర్ శ్రీ రవీంద్రనారాయణ రవి, తమిళనాడు ఐటీ శాఖ మంత్రి తిరు మనో తంగరాజ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. తాను నేడు ప్రత్యేకంగా ఆశీర్వదించబడ్డాననీ, పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని ఆదియోగి సన్నిధిలోకి జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.మహాశివరాత్రి చీకటికి, అజ్ఞానానికి ముగింపు పలికి జ్ఞానానికి మార్గం తెరిస్తుందని అన్నారు. జీవితంలో ఉన్నతమైన ఆశయాల కోసం వెతుకుతున్న వారికి ఈరోజు చాలా ముఖ్యమైన సందర్భమని, ఈ మహాశివరాత్రి మనలోని చీకట్లను పారద్రోలి మనందరినీ మరింత సంతృప్తికరమైన , ప్రగతిశీలమైన జీవితానికి నడిపించాలని ఆకాంక్షించారు. శివరాత్రి ఆధ్యాత్మిక కాంతి మన జీవితంలోని ప్రతి రోజు మన మార్గాన్ని ప్రకాశవంతం చేయాలని రాష్ట్రపతి అన్నారు.
శివుడు అందరికీ ఆరాధ్యదైవం. అతను గృహస్థుడు, సన్యాసి కూడా. అతను మొదటి యోగి, మొదటి జ్ఞాని కూడా. పరమశివుడు దయగల దేవుడని అన్నారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ యొక్క సహకారాన్ని ప్రశంసిస్తూ.. సద్గురు ఆధునిక కాలపు జ్ఞాని అని, భారతదేశం, విదేశాలలో ఉన్న అసంఖ్యాక ప్రజలు ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక పురోగతిని సాధించడంతో ఎంతగానో క్రుషి చేశారని అన్నారు. ఆయన మాటలు, చేతల ద్వారా మనకు సామాజిక బాధ్యతను కూడా బోధిస్తున్నారని అన్నారు.ఈ వేడుకలో రాష్ట్రపతి 'పంచ భూత క్రియ' కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. ఫౌండేషన్స్ శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఇక్కడ జరిగిన కార్యక్రమంలో అనేక సంగీత, నృత్య కార్యక్రమాలు జరిగాయి. కోయంబత్తూరు నగర పోలీస్ కమిషనర్ వి.బాలకృష్ణన్ పాల్గొన్నారు.