
గుజరాత్‌లోని కచ్చ ప్రాంతం, ఇప్పటివరకు హరప్ప నాగరికతకే ప్రసిద్ధిగా భావిస్తున్నారు. అయితే తాజాగా IIT గాంధీనగర్ నిర్వహించిన అధ్యయనంతో ఈ ప్రాంతంలో హరప్పకన్నా అయిదు వేల ఏళ్ల ముందు నుంచే మనుషులు జీవించారన్న విషయం బయటపడింది.
ఈ ప్రాచీన ప్రజలు, ముఖ్యంగా మ్యాంగ్రూవ్ అడవులు ఉండే తీర ప్రాంతాల్లో నివసిస్తూ, పగడాలు, బెల్లాలు (బైవాల్వ్స్, గాస్ట్రోపాడ్స్) వంటి సముద్రపు శెబ్బేళ్లను (చిప్ప కలిగిన జీవులు) ఆహారంగా వినియోగించారు. ఇవన్నీ మానవులు తినేసిన తర్వాత వేసే షెల్ మిడెన్‌లు అనే శెబ్బేళ్ల గుట్టల రూపంలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇవి మానవ చరిత్రలో ప్రాముఖ్యమైన ఆధారాలు.
Accelerator Mass Spectrometry (AMS) అనే ఆధునిక సాంకేతికతతో శెబ్బేళ్లలో ఉన్న కార్బన్-14 ను విశ్లేషించి వాటి వయసు తెలుసుకున్నారు. ఈ శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి ఈ ప్రాంతంలో హరప్పకన్నా వేల ఏళ్ల ముందే జీవించిన ప్రజల్ని నిర్ధారించారు. ప్రాచీన శెబ్బేళ్ల కుప్పలతో పాటు, కత్తర్లు, స్క్రాపర్లు, చెక్కుకునే పరికరాలు, ఇంకా వాటిని తయారు చేసిన రాయిని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది అక్కడ దైనందిన పనులకు కావాల్సిన పరికరాల తయారీ జరిగినట్టు చూపిస్తుంది.
ఈ కనుగొన్న ఆధారాలు పాకిస్తాన్‌లోని లాస్ బెలా, మక్రాన్ తీర ప్రాంతాలు, ఒమాన్ ద్వీపకల్పం వంటి ప్రదేశాల్లో కనుగొన్న పురాతన సాంస్కృతిక ఆధారాలతో సమానంగా ఉన్నాయి. అంటే ఈ సముద్రతీర ప్రాంతాల ప్రజలు జీవనోపాధిలో సమానమైన విధానాలు అభివృద్ధి చేసుకున్నట్టు తెలుస్తోంది.
దీనిపై ప్రొఫెసర్ ప్రభాకర్ మాట్లాడుతూ “ఈ ప్రజల స్థానిక జలవనరుల గురించి ఉన్న పరిజ్ఞానం, నావిగేషన్ మీద అవగాహన తదితరాలు, హరప్పనవాసులకు ఉన్నత స్థాయి నగర ప్రణాళికలకు దోహదం చేసినట్లున్నాయి” అన్నారు. ఈ పరిశోధన ఫలితాలను యూనివర్సిటీ ఆఫ్ చికాగో, సోర్బోన్ యూనివర్సిటీ (పారిస్), ISPQS కాన్ఫరెన్స్ (రాయపూర్) వంటి ప్రముఖ సెమినార్‌లలో ప్రదర్శించారు.
ఈ అధ్యయనంలో IIT గాంధీనగర్, IIT కాన్పూర్, IUAC డిల్లీ, PRL అహ్మదాబాద్, LD కాలేజ్ సహకారంతో పరిశోధకులు పాల్గొన్నారు. ఇది మన ప్రాచీన భారతదేశ చరిత్ర మూలాలను చూపించే గొప్ప అవకాశంగా పరిశోధకులు భావిస్తున్నారు.