ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ప్రత్యేక కళాఖండాలు ...

By Arun Kumar P  |  First Published Dec 21, 2024, 5:07 PM IST

మహా కుంభం 2025 వైభవాన్ని ఇనుమడింపజేయడానికి 30 ఫైబర్ రెసిన్ కళాఖండాలు ఏర్పాటు చేయనున్నారు. దేవతల, పౌరాణిక పాత్రలను చిత్రీకరించే ఈ కళాఖండాలు మేళా ప్రాంతానికి అందాన్ని తీసుకురానున్నాయి.


 ప్రయాగరాజ్‌లో జరిగే మహా కుంభమేళా-2025 ను వైభవంగా నిర్వహించడానికి యోగి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో నగరాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరికొన్ని ప్రాజెక్టుల పనులు చివరి దశలో ఉన్నాయి.

 మహా కుంభమేళా ప్రాంతంలో 30 అద్భుతమైన ఫైబర్ రెసిన్ కళాఖండాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సంస్కృతి శాఖ ఆధ్వర్యంలోని ఉత్తరప్రదేశ్ మ్యూజియం డైరెక్టరేట్ పనులు ప్రారంభించింది. ప్రణాళిక ప్రకారం మొత్తం 60 ఫైబర్ రెసిన్ కళాఖండాలను రూపొందిస్తారు. వీటిలో 30 మేళా ప్రాంతంలోనూ, మిగిలిన 30 ఉత్తరప్రదేశ్ మ్యూజియం డైరెక్టరేట్‌లోనూ ప్రదర్శిస్తారు. ఈ శిల్పాల్లో ముఖ్యంగా దేవతలు, వారి వివిధ భంగిమలు, సంఘటనలు, ఇతర పౌరాణిక, చారిత్రక పాత్రల ఆకర్షణీయమైన చిత్రాలను రూపొందిస్తారు.

వివిధ ఆకారాల శిల్పాలు

Latest Videos

undefined

ఉత్తరప్రదేశ్ మ్యూజియం డైరెక్టరేట్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం...10x6 నుంచి 49x17 అంగుళాల వరకు వివిధ కొలతల కళాఖండాలను రూపొందిస్తారు. వీటిలో అతి చిన్న శిల్పం గంగామాతది కాగా, అతి పెద్ద శిల్పం 90x50 అంగుళాలది. ఇక యమునా, సరస్వతి, సప్తమాతృక, వీణాధర శివుడు, నృత్యం చేస్తున్న గణపతి, శ్రీహరి విష్ణువు, ఉమామహేశ్వరులు, కార్తికేయుడు, తార, పద్మపాణి, ఇంద్రుడు, శచి, నేమినాథుడు, గజలక్ష్మి, గరుడ వాహన విష్ణువు, రావణానుగ్రహ శివుడు, భిక్షాటన శివుడు, విష్ణువు, శివపార్వతులు, గంగాదేవి, హరిహరులు, బలరాముడు, కృష్ణుడు, అగ్ని, సూర్యుడు,  బుద్ధుడి కళాఖండాలు ఏర్పాటుచేయనున్నారు.

శిల్పాల రూపకల్పన, ఏర్పాటు పనులను రెండు దశల్లో పూర్తి చేస్తారు. మొదటి దశలో 60 శిల్పాలను జనవరి 5 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. రెండో దశలో మేళా ప్రారంభానికి ముందే అంటే జనవరి 10 నాటికి 30 శిల్పాలను మహా కుంభ మేళా ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. మిగిలిన 30 కళాఖండాలను ఉత్తరప్రదేశ్ మ్యూజియం డైరెక్టరేట్‌కు బదిలీ చేస్తారు. ఈ శిల్పాలన్నింటినీ ఫైబర్, సిలికాన్ మోడలింగ్ ద్వారా రూపొందిస్తారు. ఇవి అసలైనవిలా కనిపించడమే కాకుండా, అధిక నాణ్యత కలిగిన మన్నికైన పదార్థాలతో తయారు చేస్తారు. ఈ పనిని పూర్తి చేయడానికి ఉత్తరప్రదేశ్ మ్యూజియం డైరెక్టరేట్ ఒక కార్యనిర్వహణ సంస్థను ఎంపిక చేసే ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తుంది.

 

click me!