ఐఐటీ నుండి సిబిఐ చీఫ్ వరకు.. ప్రవీణ్ సూద్ ఇన్స్ఫైరింగ్ జర్నీ

Published : May 07, 2025, 06:21 PM IST
ఐఐటీ నుండి సిబిఐ చీఫ్ వరకు.. ప్రవీణ్ సూద్ ఇన్స్ఫైరింగ్ జర్నీ

సారాంశం

ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్‌గా మరో ఏడాది పొడిగింపు పొందారు. ఐఐటీ, ఐఐఎం డిగ్రీలు కలిగిన ప్రవీణ్ సూద్ ఎవరో, ఆయన హై-ప్రొఫైల్ కేసులను ఎలా పరిష్కరించారో తెలుసుకోండి.

Praveen Sood: దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కి మరో ఏడాది పొడిగింపు లభించింది. బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మే 24 తర్వాత మరో ఏడాది పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గ నియామక కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది.

ప్రవీణ్ సూద్ మే 25, 2023న సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్ల పదవీకాలం పొందారు. ఇప్పుడు ఆయనకు మరో ఏడాది అదనపు బాధ్యతలు అప్పగించారు. కానీ దేశంలోనే అతి ముఖ్యమైన దర్యాప్తు సంస్థ బాధ్యతలను మళ్ళీ ఆయనకే ఎందుకు అప్పగించారనేది ప్రశ్న.

ఎవరీ ప్రవీణ్ సూద్ ఎవరు?  

ప్రవీణ్ సూద్ 1964లో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో జన్మించారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే యూపీఎస్సీ పాస్ అయి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో చేరారు. ఆయన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, కర్ణాటక కేడర్‌కు చెందినవారు. సీబీఐ డైరెక్టర్ కాకముందు ఆయన కర్ణాటక డీజీపీగా పనిచేశారు.

ప్రవీణ్ సూద్ కేవలం అధికారి మాత్రమే కాదు, టెక్నోక్రాట్ కూడా. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఐఐటీ నుండి సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐఎం బెంగళూరు నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, అమెరికాలోని సిరాక్యూస్ యూనివర్సిటీలోని మాక్స్‌వెల్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ నుండి కూడా చదువుకున్నారు.

ప్రవీణ్ సూద్ విజయాలు

హై-ప్రొఫైల్ కేసుల దర్యాప్తులో ప్రవీణ్ సూద్ తన ఖచ్చితమైన, నిష్పాక్షిక దర్యాప్తుకు ప్రసిద్ధి చెందారు. పెద్ద వ్యాపారవేత్తలు లేదా అంతర్జాతీయ సంబంధాలున్న కేసుల్లో సూద్ కీలక పాత్ర పోషించారు. సీబీఐ డైరెక్టర్ కాకముందు కర్ణాటకలో సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్), ఐసీజేఎస్ (ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్)లను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీటిని టెక్నాలజీ, న్యాయ వ్యవస్థల మధ్య వారధిగా పరిగణిస్తారు.

 ప్రవీణ్ సూద్ అత్యంత ప్రొఫెషనల్, సాంకేతికంగా బలమైన, చురుకైన అధికారిగా పేరుగాంచారు. తన పని ద్వారా తన సత్తా చాటుకున్నారు. అందుకే దేశంలోనే అతి ముఖ్యమైన దర్యాప్తు సంస్థకు నాయకత్వం వహించడానికి మరో ఏడాది అవకాశం ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ