కాంగ్రెస్‌లో చేరే ఆలోచ‌న‌లో ప్రశాంత్ కిశోర్.. సోనియా గాంధీ కుటుంబంతో సంప్ర‌దింపులు ?

Published : Mar 28, 2022, 12:56 PM IST
కాంగ్రెస్‌లో చేరే ఆలోచ‌న‌లో ప్రశాంత్ కిశోర్.. సోనియా గాంధీ కుటుంబంతో సంప్ర‌దింపులు ?

సారాంశం

సక్సెస్ ఫుల్ ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. దీని కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సోనియా గాంధీ కుటుంబంతో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. 

ప్ర‌శాంత్ కిశోర్.. ఈ పేరు తెలియ‌ని రాజ‌కీయ నాయకుడు ఉండ‌రు. జాతీయ రాజ‌కీయాలను ప‌రిశీలించే వారంద‌రికీ ఈ పేరు కొత్త‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిశోర్ కు ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఐప్యాక్ అనే సంస్థ స్థాపించి, దాని ద్వారా ప‌లు ఆయ‌న ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు స‌ల‌హాలు అందిస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో పీకే వ్యూహాల‌తోనే ప‌లు పార్టీలు అధికారం చేప‌ట్టాయ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. 

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఇప్పుడు న‌యా ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. జాతీయ రాజ‌కీయాల్లో త‌ను ఓ కీల‌క వ్య‌క్తిగా మారాల‌ని అనుకుంటున్నారు. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి బీజేపీకి ప్ర‌త్యామ్నాయాన్ని నిర్మించాల‌నే ఆలోచ‌న‌తో ఆయన ఉన్నారు. అయితే దీని కోసం ఆయ‌న కాంగ్రెస్ తో కలిసి ప‌ని చేయాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారు అయ్యింది. కానీ క్షేత్ర స్థాయిలో ఇప్ప‌టికీ ఈ పార్టీకి బ‌లం ఉంది. అయితే దీనిని ఉప‌యోగించుకొని బీజేపీకి ఎదురునిలిచే శ‌క్తిని త‌యారు చేయాల‌ని భావిస్తున్నారు. 

చ‌తికిలప‌డిన కాంగ్రెస్ ను మళ్లీ పుంజుకునేలా చేసి, వివిధ ప్రాంతీయ పార్టీల‌న్నింటినీ ఒకే వేదిక‌పైకి తీసుకురావాల‌ని, దీని ద్వారా బీజేపీని ఎదుర్కోవాల‌ని ప్ర‌శాంత్ కిశోర్ భావిస్తున్నట్టు స‌మాచారం. ప్ర‌శాంత్ కిశోర్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా విజ‌య‌వంత‌గా కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ప్ర‌స్తుతం ఏ పార్టీలో ప‌ద‌వి లేదు. కొంత కాలం జేడీయూలో ప‌ని చేసిన‌ప్ప‌టికీ అక్క‌డ రాజ‌కీయాలు ఆయ‌న‌కు క‌లిసిరాలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆయ‌న ఒక పూర్తి స్థాయి రాజకీయ నాయ‌కుడిగా మారాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీని కోసం ఆయ‌న కాంగ్రెస్ ను ఎంచుకున్నారు. 

కాంగ్రెస్ లో చేరి.. ఒక వైపు ఆ పార్టీని బలోపేతం చేస్తూనే, మ‌రో వైపు మిగితా ప్రాంతీయ పార్టీల‌ను ఒక జాతీయ స్థాయి కూట‌మిగా ఏర్పాటు చేయాల‌ని ప్ర‌శాంత్ కిశోర్ భావిస్తున్నారు. ఆయ‌న కు ఇప్ప‌టికే వివిధ పార్టీల‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న‌కు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, త‌మిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ పవార్, స‌మాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్, అలాగే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో మంచి స్నేహం ఉంది. దీంతో ఆయ‌న ఈ పార్టీల నాయ‌కుల‌ను ఏక‌తాటిపైకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే ఈ పార్టీలే కాకుండా బీజేపీకి ఎద‌రునిల‌వాలంటే కాంగ్రెస్ క‌చ్చితంగా అవ‌స‌రం ఉంటుంద‌ని ప్ర‌శాంత్ కిశోర్ అనుకుంటున్నారు. 
 
కాంగ్రెస్ ఉత్త‌ర‌భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో పుంజుకుంటే తప్ప‌.. కాషాయ పార్టీని త‌ట్టుకొని నిల‌బ‌డ‌టం చాలా క‌ష్టమ‌ని ఆయ‌న ప్ర‌శాంత్ కిశోర్ భావిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెల‌వాలి అంటే పార్టీని బ‌లోపేతం చేయ‌డం అవ‌స‌ర‌మ‌ని, సంస్థాగ‌తంగా అనేక మార్పులు చేయాల్సి ఉంటుంద‌ని పీకే అనుకుంటున్నారు. అప్పుడే కాంగ్రెస్ నిల‌దొక్కుకుంటుంద‌ని భావిస్తున్నారు. ఈ న‌ష్టాన్ని భ‌ర్తీ చేయడానికి తాను ప‌ని చేస్తాన‌ని, త‌న‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే విజ‌య‌వంత‌గా నెర‌వేరుస్తాన‌ని ఇటీవ‌లే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. అయితే కాంగ్రెస్ సంప్ర‌దాయాల ప్ర‌కారం బ‌య‌టి వ్య‌క్తికి ఇలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌రు. అందుకే ఆయ‌న కాంగ్రెస్ లో చేరుతాన‌ని గాంధీ కుటుంబానికి ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో స‌మూలంగా మార్పులు చేస్తే త‌ప్ప‌ విజ‌యం సాధించ‌లేమ‌ని వారికి చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యంలో ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. పీకే ప్ర‌తిపాత‌న‌ను కొంద‌రు జీ -23 నాయ‌కులు కూడా కాంగ్రెస్ అధ్య‌క్షురాలితో చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఆయ‌న ప్ర‌తిపాద‌న ప‌ట్ల సోనియా గాంధీ కుటుంబం ఎలా స్పందిస్తుందో ?  ప్ర‌శాంత్ కిశోర్ అనుకున్న‌ట్టుగా జ‌రుగుతుందో లేదో తెలియాలంటే మ‌రి కొంత కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?