శరద్ పవార్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ: మోడీకి ధీటైన అభ్యర్థికి వ్యూహరచన?

By telugu teamFirst Published Jun 11, 2021, 2:35 PM IST
Highlights

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమయ్యారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ధీటైన ఉమ్మడి అభ్యర్థిని దించే విషయంపై చర్చ జరిగినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ముంబై: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలిశారు. వారిద్దరి మధ్య లంచ్ సమావేశం జరిగింది. ఈ బేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉందనే ప్రచారం సాగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెసు విజయం సాధించిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీకి కూడా పనిచేయబోనని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. కానీ ఆయన తన మనసు మార్చుకున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. 

ప్రశాంత్ కిశోర్ భేటీ శరద్ పవార్ నివాసంలో జరిగింది. మిషన్ 2024 గురించి  అంటే, వచ్చే లోకసభ ఎన్నికల గురించి వారు మాట్లాడుకున్నారా అనే విషయంపై పలు రకాలుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత ధన్యావాదాలు తెలిపేందుకు ప్రశాంత్ కిశోర్ ఈ పర్యటన చేస్తున్నారని అధికారికంగా చెబుతున్నారు 

తమిళనాడులో విజయం సాధించిన స్టాలిన్ కు, పశ్చిమ బెంగాలో గెలిచిన మమతా బెనర్జీకి మద్దతు తెలిపిన నాయకులను కలిసి ధన్యావాదాలు తెలపడానికి ప్రశాంత్ కిశోర్ తన పర్యటనను ఉద్దేశించుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ప్రశాంత్ కిశోర్ పర్యటన దానికి మాత్రమే పరిమితం కాలేదని అంటున్నారు. 2024 ఎన్నికల గురించి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంపై వారిరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. 

ప్రశాంత్ కిశోర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా అనే సందేహం కలుగుతోంది. ఏ పార్టీకి కూడా ఇక ముందు తాను పనిచేయబోననే నిర్ణయమాన్ని వెనక్కి తీసుకున్నారని కూడా ఉంటున్నారు. ఆయన రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి, మరింత విస్తృతంగా రాజకీయాలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

click me!