కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్ కి రూపాయి ఫైన్..!

By team teluguFirst Published Aug 31, 2020, 12:44 PM IST
Highlights

సుప్రీమ్ కోర్టు, ప్రధాన న్యాయమూర్తులను కించపరుస్తూ ట్వీట్లు చేసినందుకు గాను ప్రశాంత్ భూషణ్ ని దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు... ఆయనకు ఒక్క రూపాయిని అపరాధ రుసుముగా చెల్లించాలని శిక్షను ఖరారు చేసింది. 

కోర్టు ధిక్కార కేసులో ప్రశాంత్ భూషణ్ కి సుప్రీమ్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. సుప్రీమ్ కోర్టు, ప్రధాన న్యాయమూర్తులను కించపరుస్తూ ట్వీట్లు చేసినందుకు గాను ప్రశాంత్ భూషణ్ ని దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు... ఆయనకు ఒక్క రూపాయిని అపరాధ రుసుముగా చెల్లించాలని శిక్షను ఖరారు చేసింది. 

సెప్టెంబర్ 15 కాళ్ళ ఈ ఫైన్ ను చెల్లించాలని, లేదంటే... మూడు నెలల జైలు శిక్ష, లేకుంటే మూడు సంవత్సరాలపాటు లాయర్ గా ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధించడం జరుగుతుందని సుప్రీమ్ కోర్టు తీర్పు వెలువరించింది. 

ప్రశాంత్ భూషణ్ గతంలో.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారీల ధర్మాసనం ఈ మేరకు ఆయనను ధోషిగా నిర్థారించింది. 

ఈ కేసు విచారణ గతంలో పూర్తి చేసిన సుప్రీం కోర్టు శిక్షను నేడు ఖరారు చేసింది. అయితే, వ్యక్తిగత స్వేచ్ఛను వినియోగించుకుని, కోర్టు పనితీరు గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను తప్పా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడలేదని ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. ఆగస్టు 3న దాఖలుచేసిన అఫిడవిట్‌లో తాను ట్వీట్ చేసిన వాటిలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకున్నారని అందుకు తాను చింతిస్తున్నానని, ఉన్నతాధికారిపై విమర్శలు న్యాయస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగించవని, దాని అధికారాన్ని తగ్గించవని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.

ప్రశాంత్ భూషణ్‌ 2009లోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టులోని 16 మంది న్యాయమూర్తులు అవినీతిపరులేనంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఈ కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ వివరణ, క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాక ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా లేదా అన్నది పరిశీలించనున్నట్లు తెలిపింది.

click me!