మంత్రివర్గ కూర్పుపై మోడీ కసరత్తు: అమిత్‌షాకు కీలక శాఖ

By narsimha lodeFirst Published May 29, 2019, 4:32 PM IST
Highlights

రెండో దఫా ప్రధాన మంత్రిగా ప్రమాణం చేయనున్న నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని 30 లేదా 32 మందికే కుదించే అవకాశం ఉందనే ప్రచారం నెలకొంది.మిత్రపక్షాలకు కూడ ఈ దఫా కొన్నిస్థానాలను కేటాయించే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: రెండో దఫా ప్రధాన మంత్రిగా ప్రమాణం చేయనున్న నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని 30 లేదా 32 మందికే కుదించే అవకాశం ఉందనే ప్రచారం నెలకొంది.మిత్రపక్షాలకు కూడ ఈ దఫా కొన్నిస్థానాలను కేటాయించే అవకాశం ఉంది.

నరేంద్ర మోడీ రెండో దఫా ఈ నెల 30వ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. దేశంలో సుమారు 60 మంత్రిత్వశాఖలున్నాయి. అయితే ఈ దఫా 30 మందికే మంత్రివర్గాన్ని పరిమితం చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ దఫా 78 మంది మహిళలు ఎంపీలుగా విజయం సాధించారు. మహిళలకు కూడ తన కేబినెట్‌లో మోడీ ప్రాధాన్యత కల్పించాలని భావిస్తున్నారు. గత మంత్రివర్గంలో సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్‌లు ఉన్నారు.

ఈ దఫా కనీసం నలుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం దక్కనుందని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి మరోసారి మోడీ కేబినెట్‌లో కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఆర్థిక శాఖ లేదా డిఫెన్స్ శాఖను ఆమెకు కేటాయిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.

నిర్మలా సీతారామన్‌కు కూడ డిఫెన్స్‌ను కొనసాగిస్తారా... లేదా విదేశీ వ్యవహరాల శాఖను అప్పగిస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు. రాజ్‌నాథ్ సింగ్‌కు మోడీ కేబినెట్‌లో చోటు తప్పక ఉంటుందనే ప్రచారం బీజేపీలో ఉంది.

అరుణ్ జైట్లీ మంత్రి పదవికి దూరంగా ఉంటారని ప్రకటించారు. అరుణ్ జైట్లీ స్థానంలో బీజేపీ చీఫ్ అమిత్ షా ను తీసుకొంటారనే ప్రచారం కూడ లేకపోలేదు. త్వరలో  ఎన్నికలు జరిగే  రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉంటేనే బెంగాల్ లో మంచి ఫలితాలను రాబట్టుకోవచ్చని వాదించే నేతలు కూడ లేకపోలేదు.

అమిత్ షా ను కేబినెట్‌ లోకి తీసుకొంటే  బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెడుతారో అనే చర్చ కూడ లేకపోలేదు. భవిష్యత్తులో పార్టీ  అవసరాలను దృష్టిలో ఉంచుకొని మోడీ తన కేబినెట్‌ కూర్పుపై చర్చిస్తున్నారని సమాచారం.

గతానికి భిన్నంగా మోడీ రెండో దఫా కేబినెట్ కూర్పు విషయమై పావులు కదుపుతున్నారు. అయితే పార్టీకి చెందిన 10 మంది కీలక నేతలకు తన కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలు దక్కాయి. అయితే తెలంగాణకు కూడ ఒక్క మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది.తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకొన్నారు. ఢిల్లీ నుండి పిలుపు కోసం తెలంగాణ నేతలు ఎదురుచూస్తున్నారు.


 

click me!