పాపులర్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ రేచెల్ చేజ్ 41 ఏళ్ళ వయసులో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు.
న్యూఢిల్లీ : ప్రముఖ న్యూజిలాండ్ బాడీ బిల్డర్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ రేచెల్ చేజ్ మరణించినట్లు ఆమె కుమార్తె ఓ ప్రకటనలో ధృవీకరించింది. ఐదుగురు పిల్లల తల్లి అయిన చేజ్ కు ఫేస్ బుక్ లో 1.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె రెగ్యులర్ గా ఫిట్‌నెస్ మీద, ఒంటరి తల్లిగా ఉండటంపై స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌లు చేస్తుంటారు.
అయితే, చేజ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. న్యూజిలాండ్ పోలీసులు ఆమె మృతిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పెద్ద కుమార్తె, అన్నా చేజ్ ఒక ప్రకటనలో "ఆమె మాకు చాలా సపోర్టింగ్ గా ఉండేది. చాలా కైండ్, మాకెప్పుడూ చక్కటి సలహాలు ఇచ్చేది. తన ఆశయం విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను తన పోస్టులతో స్పూర్తిదాయకంగా నిలిచింది. నేనామెను ఎంతో మిస్సవుతున్నాను. ఆమె ప్రేమ ఎప్పటికీ మరువలేనిది’ అని రాశారు.
క్రిస్ చేజ్‌తో ఆమె వివాహం జరిగింది 14 సంవత్సరాల వైవాహిక బంధం తరువాత ఫిబ్రవరి 2015 లో విడాకులు తీసుకున్నారు. క్రిస్ తర్వాత మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో పట్టుబడ్డాడు. 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. రేచెల్ చేజ్ చిన్న వయస్సు నుండే బాడీ బిల్డింగ్‌లో సత్తా చాటింది. న్యూజిలాండ్‌లో అనేక పోటీలలో గెలుపొందింది. 2011లో, లాస్ వెగాస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఒలింపియా బాడీ-బిల్డింగ్ ఈవెంట్‌లో న్యూజిలాండ్ నుండి పాల్గొన్న మొదటి మహిళగా రేచెల్ చేజ్ నిలిచింది.
2016లో, రేచెల్ తన విడాకులకు దారితీసిన విషపూరిత సంబంధాన్ని చెబుతూ ఓ పోస్ట్ రాసింది. తమ బంధాలను దుర్వినియోగం చేసే.. అనుబంధాలను పిల్లలకోసమైనా వదిలేయాలని చెప్పుకొచ్చింది. విడాకుల సమయంలో తాను తొమ్మిది నెలల గర్భవతినని...ఇద్దరు చిన్న పిల్లలున్నారని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన పిల్లలను ఒంటరిగా పెంచడం తనకు మరింత ఆత్మవిశ్వాసం, సాధికారతను ఎలా కలిగిస్తుందో ఆమె పేర్కొంది.