
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఇటీవలే రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మూడు రోజుల సదస్సులో పలు సవరణలు, మార్పులను కాంగ్రెస్ పార్టీ అమలు చేయడానికి అంగీకరించింది. అయితే, పార్లమెంటరీ బాడీ ఏర్పాటుకు నిరాకరించింది. ముఖ్యంగా పార్టీ అధినాయకత్వంపై మార్పులు చేపట్టలేదు. ఈ మేధోమథన కార్యక్రమానికి సుమారు 400 మంది కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ప్రక్షాళన ఆశించిన నేతలకు రుచి చూపించి వదిలేసినట్టుగా చిన్న చిన్న మార్పులు తెచ్చారు. ఈ మేధోమథనంపై కొందరు కాంగ్రెస్ నేతల్లోనూ అసంతృప్తి ఉన్నది. అయితే, కాంగ్రెస పార్టీ అమలు చేయనున్న ఈ మార్పులపై ప్రశాంత్ కిశోర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాలని నేతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా, తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్ ఫలితాలపై నా అభిప్రాయాన్ని చాలా మంది తరుచూ అడుగుతున్నారు’ అంటూ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం, ఈ మూడు రోజుల చింతన్ శిబిర్ అర్థవంతమైన విషయాలను సాధించడంలో విఫలమైందని పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు లేకుండా యథాతథంగా ఇంకొంత కాలం పొడిగించడానికి ఉపయోగపడిందని విమర్శించారు. కనీసం.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసే వరకైనా కాంగ్రెస్ నాయకత్వం యథాతథంగా కొనసాగడానికి ఈ మేధోమథన కార్యక్రమం ఉపయోగపడుతుందని చురకలు అంటించారు.
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరికపై తీవ్ర చర్చ జరిగింది. దాదాపు ఖరారు అవుతుందన్న సమయంలో కాంగ్రెస్ నేతలకు, ప్రశాంత్ కిశోర్‌కు ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌లోకి చేరలేదు.
ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల మేధోమథన సదస్సు చింతన్ శిబిర్‌ను కాంగ్రెస్ నిర్వహించింది. ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వివరాలు పరిశీలిద్దాం.
వన్ ఫ్యామిలీ వన్ టికెట్:
కాంగ్రెస్ పార్టీ ఆమోదించిన ప్రతిపాదనల్లో ఒక కుటుంబం, ఒక టికెట్ నిబంధన ఉన్నది. ఈ నిబంధన ప్రకారం, టికెట్లను పార్టీ నేతల కుటుంబీకులకు, బంధువులకు ఇవ్వరు. లేదా పార్టీ కోసం కనీసం ఐదు సంవత్సరాలు క్రియాశీలకంగా పని చేసి ఉండాలి. ఇలా పని చేసి ఉంటే.. పార్టీ నేతతోపాటు ఐదేళ్లు పని చేసిన వారికీ టికెట్ ఇవ్వడానికి అర్హత ఉంటుంది.
ఐదేళ్ల నిబంధన:
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సహా జిల్లా, బ్లాక్ కమిటీలు, ఇతర శాఖలు, సెల్‌లు, ఫ్రాంటల్ ఆర్గనైజేషన్‌లలోనూ పార్టీ పదవులు ఐదేళ్లు మాత్రమే నిర్వహించాలనే నిబంధనను కాంగ్రెస్ సమ్మతించినట్టు సమాచారం. పార్టీ పదవులు చేపట్టేవారు ఐదేళ్ల తర్వాత రాజీనామా చేయాల్సే ఉంటుంది. ఒక వేళ మళ్లీ అదే పోస్టు సదరు వ్యక్తి చేపట్టాలంటే.. మూడేళ్లపాటు పదవికి దూరంగా ఉండాలి. దీన్ని కూలింగ్ పీరియడ్‌గా పేర్కొన్నారు.
యువతకు ప్రాధాన్యత:
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. 50 శాతం కమిటీ సభ్యులు 50 ఏళ్లలోపు వారే అయి ఉండాలనే ప్రతిపాదనను ఆమోదించింది.