జైపూర్: సామాన్యులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానాలు వేసే పోలీసు అధికారులు ఉల్లంఘిస్తే ఫైన్లేవీ ఉండవా? అంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలతోపాటు క్యాప్షన్లు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆ ఫొటోలపై చాలా మంది కామెంట్లు. చాలా మంది ఈ ఫొటోలను ఇగ్నోర్ చేసేవారు కూడా. కానీ, రాజస్తాన్ డీజీపీ మాత్రం ఉపేక్షించలేదు. పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సాధారణ ప్రజలకు వేసే ఫైన్లకు డబులు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించారు. అంతేకాదు, శాఖాపరమైన చర్యలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ఆదేశాలు రాజస్తాన్‌లో అమల్లోకి రాబోతున్నాయి.
రాజస్తాన్ డీజీపీ ఉమేశ్ మిశ్రా సూచనలతో అదనపు డీజీపీ (ట్రాఫిక్) వీకే సింగ్ డైరెక్షన్స్ జారీ చేశారు.
పోలీసులు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆ ఆదేశాలు తెలిపాయి. హెల్మెట్ ధరించకున్నా, టూ వీలర్ పై ఇద్దరికి మించి కూర్చున్నా, ఫోర్ వీలర్‌లోనైతే సీట్ బెల్ట్ పెట్టుకోకున్నా, రెడ్ లైట్ సిగ్నల్ జంప్ చేసినా, మద్యం తాగి డ్రైవ్ చేసినా.. లేదా ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు నార్మల్ ఫైన్‌కు రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
డబుల జరిమానా చెల్లించడమే కాదు.. డిపార్ట్‌మెంట్ యాక్షన్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుందని వీకే సింగ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.