
ఓ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. అతని బాధ నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకుంది. ఆపదలో ఉన్న తనకు పోలీసులు రక్షణ కల్పిస్తారని సంబరపడింది. కానీ.. ఆమె ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. రక్షించాల్సిన పోలీసే.. భక్షకుడిగా మారాడు. తన ముందు డ్యాన్స్ చేస్తే.. కేసు నమోదు చేసుకుంటానంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కాగా... పోలీసు అధికారి తనపై ప్రవర్తించిన తీరుని బాలిక వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం.ఆమె ఆరోపణ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల తెగ వైరల్ అయింది. గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగినట్టు ఆమె తెలిపింది. సదరు బాలిక తన కుటుంబంతో కలసి గోవింద్ నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తుంటుంది.
అయితే ఇంటి యజమాని మేనల్లుడు ఇటీవల తనతో పలు మార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదు చేసేందుకు తన తల్లితో కలసి గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లానని ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్.. డ్యాన్స్ చేస్తేనే కేసు నమోదు చేస్తానంటూ తనకో కండీషన్ పెట్టాడని ఆమె వాపోయింది.
మరోవైపు.. అద్దె ఇంటి విషయంలో బాలిక కుటుంబానికి ఇంటి యజమానికి మధ్య వివాదం నడుస్తోందని గోవింద్ నగర్ సర్కిల్ ఇన్‌స్ఫెక్టర్ తెలిపారు. ఈ విషయంలో కలుగ జేసుకోవాలని పోలీసులపై ఒత్తిడి చేసేందుకే ఆ బాలిక.. ఆరోపణల వీడియోను వైరల్ చేసినట్టు తాము ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు.