స్టేషన్‌కు షార్ట్‌లతో వెళ్లిన యువకులు.. తిప్పి పంపిన పోలీసులు, ప్యాంట్లు వేసుకొస్తేనే

By Siva KodatiFirst Published Jul 24, 2021, 8:32 PM IST
Highlights

షార్ట్‌లు ధరించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులను కోల్‌కతా పోలీసులు తిప్పి పంపారు. ఇంటికి వెళ్లి ప్యాంట్లు వేసుకొస్తేనే కంప్లయింట్ తీసుకుంటామని స్పష్టం చేశారు. 

మనకు ఏదైనా సమస్య, ఇబ్బంది వుంటే వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. అలాంటి కంప్లయింట్ ఇచ్చేందుకు వెళ్లిన వారిని పోలీసులు తిప్పి పంపారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన దత్తా, అవిషేక్ అనే ఇద్దరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, వారిని అధికారులు తిప్పి పంపారు. అందుకు కారణం... వారిద్దరూ జిమ్ లో ధరించే నిక్కర్లు (షార్ట్స్) వేసుకుని ఉండడమే. ఇటీవల కోల్‌కతాలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వారిద్దరూ ఈ నెల 17న కోల్‌కతాలోని కస్బా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే, పోలీసుల వారి నుంచి ఫిర్యాదును స్వీకరించలేదు.

మీరు షార్ట్‌లు ధరించి వచ్చారు... లోపల స్టేషన్ లో మహిళా పోలీసులు ఉన్నారు. మిమ్మల్ని లోపలికి అనుమతించలేం అని పోలీసులు వారికి స్పష్టం చేశారు. వెంటనే ప్యాంట్లు వేసుకుని స్టేషన్‌కు రావాలని దత్తా, అవిషేక్‌లకు పోలీసులు సూచించారు. వారు చెప్పినట్టే ప్యాంట్లు వేసుకుని వస్తే, అప్పుడు పీఎస్ లోపలికి అనుమతించడమే కాకుండా, వారి నుంచి ఫిర్యాదును స్వీకరించారు.

ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై ఆ ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. స్టేషన్‌కు వచ్చేందుకు డ్రెస్ కోడ్ ఏదైనా ఉందా? అని వారు ప్రశ్నించారు. దీనికి కోల్‌కతా పోలీసులు ధీటుగా స్పందించారు. మీ కార్యాలయాలకు మీరు షార్ట్‌లతో వెళతారా? అని తిరిగి ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

click me!