
ప్రపంచకప్ లో భారత్ పోరు ముగిసింది. సెమీఫైనల్స్ దాకా వచ్చిన టీం ఇండియా... న్యూజిలాండ్ తో చివరిదాకా పోరాడి ఓటమిపాలయ్యింది. దీంతో... చివరకు ఇంటికి తిరుగుముఖం పట్టక తప్పలేదు. కాగా... దీనిపై ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ మ్యాచ్ ఫలితం తనను తీవ్రంగా నిరాశపరిచిందని మోదీ అన్నారు. అయితే... టీం ఇండియా విజయం కోసం చివరి వరకూ పోరాడి తన స్ఫూర్తిని ప్రదర్శించిందని అన్నారు. ప్రపంచకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ ఆకట్టుకుందని ఆయన గుర్తుచేసుకున్నారు. జీవితంలో గెలుపు, ఓటములు సహజమేనని ఆయన పేర్కొన్నారు.
మాంచెస్టర్‌లో కివీస్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో రవీంద్ర జడేజా, ధోనీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పోరాడినప్పటికీ భారత్ ఓటమి పాలైంది. లీగ్ దశలో అద్భుత పోరాటం చేసిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ముగ్గురూ ఒక్కొక్క పరుగే చేసి వెనుదిరగడంతో కష్టాల్లో పడిన టీమిండియా.. చివరిదాకా పోరాడినప్పటికీ 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.