Amrit Bharat Station Scheme : ఒకేసారి 553 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న మోడీ

By Siva Kodati  |  First Published Feb 26, 2024, 8:34 AM IST

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్లను పునరుద్ధరించే పనులకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.385 కోట్ల వ్యయంతో రీ డెవలప్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌లోని గోమతి నగర్ స్టేషన్‌ను కూడా మోడీ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. 


అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 553 రైల్వేస్టేషన్లను పునరుద్ధరించే పనులకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగంగా స్టేషన్ల పైకప్పు ప్లాజాలు, సిటీ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా సౌకర్యాలను మెరుగుపరుస్తారు. అలాగే పలు రాష్ట్రాలలోని దాదాపు 1500 రోడ్ ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని అధికారులు వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు రూ.385 కోట్ల వ్యయంతో రీ డెవలప్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌లోని గోమతి నగర్ స్టేషన్‌ను కూడా మోడీ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. 

భవిష్యత్తులో పెరిగిన ప్రయాణీకుల  రద్దీని తీర్చడానికి, ఈ స్టేషన్‌లో ఎరైవల్, డిపార్చర్ సౌకర్యాలను వేరు చేశారు. తద్వారా నగరం రెండు వైపులా చేరుకోవచ్చు. సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ , ఎయిర్‌కోర్స్, రద్దీ లేని సర్క్యులేషన్, ఫుడ్ కోర్టులు, రెండు బేస్‌మెంట్లలో విస్తారమైన పార్కింగ్ స్థలం వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

Latest Videos

27 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి వున్న అమృత్ భారత్ స్టేషన్లను రూ.19,000 కోట్లకు పైగా ఖర్చుతో తిరిగి అభివృద్ధి చేయనున్నారు. ఈ స్టేషన్‌లు నగరానికి ఇరువైపులా సిటీ సెంటర్‌లుగా పనిచేస్తాయి. పైకప్పు ప్లాజాలు, అందమైన ల్యాండ్‌స్కేపింగ్, ఇంటర్ మోడల్ కనెక్టివిటీ, అత్యాధునిక ఫ్రంట్ ఎంట్రన్స్, పిల్లల ఆట స్థలం, కియోస్క్‌లు, ఫుడ్ కోర్టులను ఈ స్టేషన్‌లలో ఏర్పాటు చేస్తారు. పర్యావరణం, దివ్యాంగులకు అనుకూలమైనవిగా ఈ స్టేషన్‌లను రీ డెవలప్‌మెంట్ చేస్తారు. స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాలను ప్రేరణగా తీసుకుని ఈ భవనాల రూపకల్పన చేయనున్నారు. 

సోమవారం 1500 ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేస్తారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి వున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ల మొత్తం వ్యయం దాదాపు రూ.21,520 కోట్లు అని పీఎంవో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌లు రద్దీని తగ్గించడంతో పాటు భద్రత, కనెక్టివిటీని పెంచుతాయి. రైలు ప్రయాణ సామర్ధ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయి.

click me!