
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసీలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రీకాశీ విశ్వనాథ్ ధామ్ (kashi vishwanath dham) తొలి దశ నిర్మాణాలను ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) రేపు ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్ట్ పనులకు 2018లో వారణాసి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రధాని శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ ఆలయం వైశాల్యం కేవలం 2,700 అడుగులు ఉండగా, ఈ ప్రాజెక్టులో భాగంగా 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించనుంది.
పునర్నిర్మాణం సమయంలో 40 వరకూ ప్రాచీన దేవాలయాలు బైటపడటంతో వాటి సుందరీకరణకు అనుగుణంగా డిజైన్లను తిరిగి మార్చాల్సి వచ్చింది. రూ. 339 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఖర్చు క్రమేణా రూ. 400 కోట్లు చేరుకుంది. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు 3 రోజులపాటు దర్శనాలు నిలిపివేశారు అధికారులు. కాశీ ఆలయ చరిత్రలో భక్తుల దర్శనం నిలివేయడం ఇది రెండవసారి. గతేడాది కరోనా వ్యాప్తి సమయంలో తొలిసారి భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. తాజాగా రేపటి శ్రీకాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ కోసం మరోసారి మూసివేశారు.
ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం 23 భవనాలను ప్రారంభించనున్నారు. వాటిలో ‘యాత్రి సువిధ కేంద్రాలు’, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, వేద కేంద్రం, ముముక్షు భవన్, సిటీ మ్యూజియం , వ్యూయింగ్ గ్యాలరీ, ఫుడ్ కోర్ట్ తదితరాలు ఉంటాయి. ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణాన్ని 1780లో మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు.