భోపాల్-ఢిల్లీ వందే భారత్ రైలును ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ

By Mahesh RajamoniFirst Published Mar 30, 2023, 4:22 PM IST
Highlights

New Delhi: ఏప్రిల్ 1న భోపాల్-ఢిల్లీ వందే భారత్ రైలును ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. భోపాల్-న్యూఢిల్లీ మధ్య న‌డిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 7.45 గంటల్లో 708 కిలో మీట‌ర్ల దూరాన్ని చేరుకుంటుందని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
 

PM Modi To Flag Off Bhopal-Delhi Vande Bharat Train: ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 1న మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో పర్యటించనున్నారని ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం ఒక ప్రకటనలో తెలిపింది. భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును రాణి కమలాపతి స్టేషన్ లో ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో  కూడా పాల్గొంటారు. ఇదే విష‌యం గురించి మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. "ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఏప్రిల్ 1న భోపాల్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రూపంలో పెద్ద బహుమతి ఇస్తారు. వందేభార‌త్ రైలును రాణి కమలాపతి స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి జెండా ఊపి ప్రారంభిస్తారు" అని తెలిపారు. 

భోపాల్-న్యూఢిల్లీ మధ్య న‌డిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 7.45 గంటల్లో 708 కిలో మీట‌ర్ల దూరాన్ని చేరుకుంటుందని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా, భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మధ్య ప్రవేశపెట్టనున్న కొత్త రైలు దేశంలో పదకొండో వందేభారత్ రైలు కానుంది. "స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు లో అత్యాధునికమైన‌ ప్రయాణీకుల సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఇక్క‌డి పర్యాటకాన్ని పెంచడంతో పాటు ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని" ప్ర‌భుత్వం పేర్కొంది. తొలుత భోపాల్ లోని ఖుసాబావు ఠాక్రే హాల్ లో జరిగే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో ప్రధాని పాల్గొంటారు, అక్కడి నుంచి స్టేషన్ కు వెళ్లి మధ్యాహ్నం 3.15 గంటలకు భోపాల్-న్యూఢిల్లీ వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తారు.

కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ ఏడాది సదస్సు థీమ్ ‘Ready, Resurgent, Relevant’. "ఈ సదస్సులో జాతీయ భద్రతకు సంబంధించిన పలు ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. సాయుధ దళాల్లో ఐక్యత, సంబంధాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. సాయుధ దళాల సన్నద్ధత, 'ఆత్మనిర్భరత' సాధించే దిశగా రక్షణ వ్యవస్థలో పురోగతిని కూడా సమీక్షిస్తారు" అని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. త్రివిధ దళాల అధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సదస్సులో పాల్గొనేందుకు రక్షణ మంత్రి ఈ నెల 30న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రానున్నార‌ని అధికారులు తెలిపారు.

click me!