పౌరసత్వ సెగ: ప్రతిపక్షాలపై మోడీ విసుర్లు

By sivanagaprasad KodatiFirst Published Dec 22, 2019, 2:20 PM IST
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదానం నుంచి ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదానం నుంచి ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో 40 లక్షల మందికి భూపట్టాలు ఇచ్చామన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. కానీ ఆప్ ప్రభుత్వం అనేక అబద్ధపు హామీలు ఇచ్చిందని మోడీ ఫైరయ్యారు. తమకు పేద ప్రజలే వీఐపీలని.. ఢిల్లీ ప్రజలు తాగేందుకు ప్రస్తుతం నీరు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:ఓ వైపు పౌరసత్వ రగడ: పాక్ మహిళకు భారత పౌరసత్వం

తాగునీటి సమస్యను తీర్చాలన్న ధ్యాస ఢిల్లీ ప్రభుత్వానికి లేదని.. ఆప్ ప్రభుత్వ హయాంలో ప్రజలు తాగునీటిని కొనుక్కుంటున్నారని మోడీ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఆందోళనలు సృష్టించేందుకు నకిలీ వీడియోలను ప్రొత్సహిస్తున్నారని ప్రధాని విమర్శించారు. 

ఇదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన పార్లమెంటుకు ధన్యవాదాలు చెప్పాల్సిందిగా ఆయన కోరారు. పౌరసత్వ సవరణ చట్టంపై కొందరు దుష్ప్రచారాన్ని చేస్తున్నారని.. ఢిల్లీలో అనేక అనధికారిక కాలనీలను మతాలను చూడకుండా రెగ్యులరైజ్ చేసిన సంగతిని ప్రధాని ప్రస్తావించారు.

కనీసం మెదడైనా ఉంటే చట్టం గురించి సరిగ్గా తెలుసుకోవాలని.. అబద్ధాలు ప్రచారం చేసే వాళ్లను నమ్మొద్దని మోడీ విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు.

Also Read:పౌరసత్వ సెగ, ఢిల్లీ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సిబ్బంది.. విమానాలు రద్దు

8 కోట్ల మందికి పైగా గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇచ్చామని.. అప్పుడు మతాలను చూశామా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు ఉజ్వల యోజన పథకంతో లబ్ధి పొందుతున్నారని.. జాతి, మతాలను చూడకుండా కేవలం పేదరికాన్ని మాత్రమే చూసి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మోడీ వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని.. అయితే భిన్నత్వంలో ఏకత్వం భారత బలమని మోడీ స్పష్టం చేశారు. విపక్ష పార్టీలు ప్రజలను భయపెడుతున్నాయని.. మీ భూమిపై మీకు సంపూర్ణ హక్కు వుందని ప్రధాని వెల్లడించారు. 

click me!