కాంగ్రెస్ హయాంలో దేశ ప్రగతి నాశనం.. 60 ఏళ్లలో మిగిలింది గుంతలే : రాజ్యసభలో మోడీ విమర్శలు

By Siva KodatiFirst Published Feb 9, 2023, 3:10 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆరు దశాబ్థాల పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రగతిని నాశనం చేసిందన్నారు.  ఆ పార్టీ ఇప్పుడు తన పాపాలకు శిక్షను అనుభవిస్తోందని ప్రధాని చురకలంటించారు.

పార్లమెంట్‌లో విపక్షాల తీరు బాధ కలిగిస్తోందన్నారు ప్రధాని మోడీ. గురువారం ఆయన రాజ్యసభలో ప్రసంగించారు. అయితే ప్రధాని ప్రసంగిస్తుండగా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నినాదాల మధ్యే ప్రధాని ప్రసంగం కొనసాగించారు. నినాదాలు చేస్తున్న వారు దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో చెప్పాలని మోడీ డిమాండ్ చేశారు. ఇలాంటి ముఖ్యమైన సభలో నినాదాలు చేయడం దురదృష్టకరమని ప్రధాని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆలోచన విపక్షాలకు లేదని మోడీ చురకలంటించారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన సభలో ఇలా ప్రవర్తిస్తారా అని ఆయన ప్రశ్నించారు. మీరు విసిరే బురదలో కూడా కమలం వికసిస్తుందని మోడీ అన్నారు. 

దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసిందని నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వం ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. పరిష్కారం చూపేవాళ్లను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని.. ఎంత అడ్డుకున్నా సమస్యల పరిష్కారంలో మాత్రం వెనకడుగు వేయమని ప్రధాని స్పష్టం చేశారు. కొందరు ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తోందని.. సాంకేతికతతో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని మోడీ పేర్కొన్నారు. పేదలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చామని.. సామాన్యుడి ముంగిటకు పథకాలు తీసుకెళ్లామని ప్రధాని తెలిపారు. 16 వేలకు పైగా గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపామని.. దేశ ప్రజల విశ్వాసం గెలుసుకున్నామని మోడీ అన్నారు. 

ALso REad: అదానీ ఇష్యూపై స్పందించాలని ప్రతిపక్షాల డిమాండ్.. స్కామ్‌ల జాబితాను ఏకరువుపెట్టిన ప్రధాని మోడీ

మారుమూల పల్లెలనూ అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ 4 దశాబ్ధాలకు పైగా గరీబీ హఠావో నినాదంతోనే కాలం వెళ్లబుచ్చిందని ప్రధాని చురకలంటించారు. అసలైన లౌకికతత్వం అంటే ఏంటో తామే చూపించామని .. వివక్ష లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందేలా చేశామని మోడీ తెలిపారు. సామాన్యుడి సంక్షేమమే తమ ప్రాధాన్యత అని.. తమ పాలనలో 25 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అందించామని ఆయన చెప్పారు. తొలిసారిగా తాము ఆదివాసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశామని మోడీ వెల్లడించారు. ఆదివాసీల కోసం ఐదు రెట్లు నిధులు ఎక్కువగా ఖర్చు చేశామని ప్రధాని పేర్కొన్నారు. 

ఆదివాసీల కోసం బడ్జెట్‌లో 1.20 లక్షల కోట్లు కేటాయించామని మోడీ చెప్పారు. అందరి కోసం పనిచేయడమే అసలైన లౌకికతత్వమని ప్రధాని వెల్లడించారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ గుంతలను మాత్రమే తవ్విందని.. ఆ పార్టీ ఇప్పుడు తన పాపాలకు శిక్షను అనుభవిస్తోందని ప్రధాని చురకలంటించారు. సన్న, చిన్నకారు రైతులపైనే దేశ ప్రగతి ఆధారపడి వుంటుందని మోడీ స్పష్టం చేశారు. ఆరు దశాబ్ధాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండుగ అని.. యూపీఏ పాలనను తాను నిశితంగా పరిశీలించానని ఆయన తెలిపారు. ఇతర దేశాలు అభివృద్ధి చెందితే, భారత్‌ను కాంగ్రెస్ నాశనం చేసిందని మోడీ స్పష్టం చేశారు. 
 

click me!