Tamilnadu : ఆ రోజు డిఎంకేకు ఒక్క ఓటు పడదు... : ప్రధాని మోదీ

By Arun Kumar PFirst Published Apr 10, 2024, 3:05 PM IST
Highlights

లోక్ సభ ఎన్నికల వేళ దక్షిణాదిపై దృష్టిపెట్టిన బిజెపి ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దింపింది. ఆయన తాజాగా తమిళనాడులో పర్యటించారు. చెన్నైలో భారీ రోడ్ షో చేపట్టి అధికార డిఎంకేపై నిప్పులు చెరిగారు. 

చెన్నై : భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చి అధికారాన్ని పొందే ప్రయత్నాల్లో వున్నారు. కేవలం గెలుపు కాదు అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే బిజెపి నేతృత్వంలోని ఎన్డియే కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తరాదిన బిజెపి బలంగా వుండటంతో దక్షిణాదిపై దృష్టిపెట్టారు. తరచూ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు స్థానిక ప్రభుత్వాలపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ అవినీతి, అక్రమాల ఆరోపణలు చేస్తున్నారు. ఇలా తాజాగా తమిళనాడులో పర్యటించిన మోదీ అధికార డిఎంకెపై తీవ్ర విమర్శలు చేసారు. 

తమిళనాడులో ప్రస్తుతంలో అధికారంలో వున్నది డిఎంకే పార్టీ కాదు... ఓ ఫ్యామిలీ కంపనీ అని మోదీ ఆరోపించారు. సీఎం స్టాలిన్ తో పాటు మంత్రిగా వున్న ఆయన తనయుడు ఉదయనిధి, మిగతా కుటుంబసభ్యులు కూడా రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కుటుంబ రాజకీయాలు యువత భవిష్యత్ ను నాశనం చేస్తున్నాయని... వారిని ముందుకు వెళ్లనివ్వకుండా పాతతరం ఆలోచనలనే వారిపై రుద్దుతున్నారని అన్నారు. డిఎంకేను ఓడిస్తేనే తమిళనాడు యువత అన్నిరంగాల్లో అవకాశాలు సాధిస్తారని అన్నారు. యువత భవిష్యత్  బాగుంటాలంటే బిజెపిని గెలిపించాలని ప్రధాని మోదీ తమిళ ప్రజలను కోరారు. 

అవినీతి, అక్రమాలపై డిఎంకే కు కాపీ రైట్ వుందని మోదీ ఎద్దేవా చేసారు. కుటుంబ రాజకీయాలు, అవినీతి పోవాలన్నా... తమిళ సంస్కృతితో పాటు యువత భవిష్యత్ బాగుండాలన్నా డిఎంకేను ఓడించాలన్నారు. భాష, ప్రాంతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి విభజిస్తున్న పార్టీ డీఎంకే... అలాంటి పార్టీకి ప్రజలే తగిన సమాధానం చెప్పాలన్నారు.  డిఎంకే రాజకీయాల గురించి ప్రజలకు అర్థమైన రోజు ఒక్క ఓటు కూడా ఆ పార్టీకి పడదని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

Thank you Chennai! Today was special. pic.twitter.com/9PuBCLAdni

— Narendra Modi (@narendramodi)

 

తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రధాని మోదీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై, ఎంపీ అభ్యర్థి తమిళిసై తో కలిసి భారీ రోడ్ షో చేపట్టారు.  ఈ రోడ్ షో లో బిజెపి నాయకులు, కార్యకర్తలే కాదు సామాజ్య ప్రజలు కూడా భారీగా పాల్గొన్నారు. ప్రధాని మోదీ నినాదాలతో రోడ్ షో ప్రాంతమంతా దద్దరిల్లింది. తనకు ఇంత భారీ స్వాగతం పలికిన ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ఎన్డిఏ కూటమికి మద్దతివ్వాలని ప్రధాని మోదీ కోరారు. 
 

click me!