ఆక్సిజన్‌కు కటకట.. కేంద్రంపై రాష్ట్రాల ఒత్తిడి: మోడీ అత్యవసర సమావేశం

By Siva KodatiFirst Published Apr 16, 2021, 7:05 PM IST
Highlights

దేశంలో మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమీక్ష నిర్వహించారు. వైద్య, ఉక్కు, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ పలు కీలక సూచనలు చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు 2 లక్షలకు పైగా కేసులతో భారత్ అమెరికాను దాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన సామాగ్రి భారత్‌లో నిండుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా బెడ్లు, ఆక్సిజన్ , వ్యాక్సిన్, రెమ్‌డెసివర్ ఇంజెక్షన్‌ల కొరత ఆసుపత్రులను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమీక్ష నిర్వహించారు.

వైద్య, ఉక్కు, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ పలు కీలక సూచనలు చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమన్నారు.

వైరస్ తీవ్రత అధికంగా ఉన్న 12 రాష్ట్రాలైన- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లో ఆక్సిజన్‌ సరఫరాపై ఆరా తీసినట్టు పీఎంవో అధికారులు ప్రధానికి వివరించారు. ఈ క్రమంలో వచ్చే 15 రోజుల వరకు ఆక్సిజన్‌ లభ్యత, వినియోగం గురించి ప్రధాని సమీక్షించారు. 

Also Read:ఇండియాలో కోరలు చాస్తున్న కరోనా: ఒక్క రోజులోనే రెండు లక్షలు దాటిన కేసులు

దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు ఆక్సిజన్‌ ట్యాంకర్లు తిరిగేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. అలాగే ఆక్సిజన్ ప్లాంట్‌ సామర్థ్యం ప్రకారం ఉత్పత్తిని పెంచాలని మోడీ సూచించారు.

సిలిండర్‌ ఫిల్లింగ్‌ ప్లాంట్‌లు అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 24 గంటలు పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ప్రధాని ఆదేశించారు. డ్రైవర్లు షిఫ్టుల విధానంలో ఆక్సిజన్‌ సరఫరా చేసేలా చూడాలని ఆయన సూచించారు. 

click me!