
ఒక్క నిమిషంలో 109 పుష్ అప్స్ (push-ups) చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness World Record ) స్థానం పొందిన మణిపూర్ యువకుడు థౌనవోజమ్ నిరంజోయ్ సింగ్‌ని (24) (Thounaojam Niranjoy Singh) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘‘మన్ కీ బాత్’’ (Mann Ki Baat) కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ క్రమంలోనే నిరంజోయ్ రికార్డును ప్రస్తావించి అతనిని కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రధాని ఏమన్నారంటే.. ‘‘ ఈ దేశంలోని యువతకు నాదొక ప్రశ్న.. సాధారణంగా వారు ఒకేసారి ఎన్ని పుష్ అప్‌లు తీయగలరు..? ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీకు ఆశ్చర్యం కలగకమానదు. మణిపూర్‌కు చెందిన 24 ఏళ్ల థౌనవోజమ్ నిరంజయ్ సింగ్ ఒక్క నిమిషంలో 109 పుష్ అప్‌లు తీసి రికార్డు సృష్టించారు. నిరంజోయ్‌కి రికార్డు బద్దలు కొట్టడం కొత్త కాదు. ఆయన గతంలో ఒక నిమిషంలో గరిష్ట సంఖ్యలో పుష్-అప్‌లు చేసిన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అందువల్ల దేశ ప్రజలు ఆయన నుండి ప్రేరణ పొంది శారీరక దృఢత్వాన్ని అలవర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను’’ అని నరేంద్ర మోడీ అన్నారు.
అయితే నిరంజోయ్‌కి ఈ విజయం అంత ఈజీగా దక్కలేదు. 13 ఏళ్లు పాటు కఠోర సాధన చేశాడు. నిమిషంలో ఇన్ని పుష్ అప్స్ చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. నిరంజోయ్ గతంలోనూ నిమిషానికి 105 పుష్ అప్స్ చేసి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పుడు నిమిషానికి 109 పుష్ అప్స్ చేసి తన పేరిట ఉన్న రికార్డును తనే బద్ధలు కొట్టాడు. జనవరి 14న జరిగిన అజ్టెక్స్ స్పోర్ట్స్ మణిపూర్ ఈవెంట్‌లో నిరంజోయ్ సింగ్ పాల్గొని ఈ ఘనత సాధించారు. తన చేతి మునివేళ్ళు, కాలి మునివేళ్ళు ఆధారంగా పుష్ అప్స్ చేసి ఆయన ఔరా అనిపించుకున్నారు
ఈ విజయం సాధించినందుకు నిరంజోయ్ సింగ్‌ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (kiren rijiju) అభినందించారు. ఇన్ని పుష్ అప్స్ చేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన సింగ్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది... నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఒక నివేదిక ప్రకారం యూకేకు చెందిన గ్రాహం మాలీ అనే వ్యక్తి 2009లో ఒక నిమిషంలో గరిష్ట సంఖ్యలో పుష్ అప్‌లు చేశారు.
ఇక మన్ కీ బాత్ విషయానికి వస్తే.. కొత్త ఆశలతో 2022లో అడుగు పెట్టామని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. నివాళి అర్పించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండియా గేట్ దగ్గర ఉన్న 'అమర్ జవాన్ జ్యోతిని, నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరున్న అమరవీరుల జ్యోతిని విలీనం చేయడాన్ని చూశామనీ, ఈ రెండు జ్యోతుల విలీనం అమరవీరులకు గొప్ప నివాళిగా పేర్కొంటూ తనకు పలువురు రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది ఉత్తరాలు రాశారని ప్రధాని అన్నారు. అలాగే..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ వార్ మెమోరియల్‌ను సందర్శించాలని ప్రధాని కోరారు.